తాలిబన్ల దాడిలో భారత ఫొటో జర్నలిస్టు మృతి

by Anukaran |   ( Updated:2021-07-16 05:38:09.0  )
talibans
X

కాబూల్: ప్రతిష్టాత్మక పులిట్జర్ అవార్డు విన్నింగ్ భారత ఫొటో జర్నలిస్టు దానిష్ సిద్దిఖీ తాలిబన్ల దాడిలో శుక్రవారం మృతి చెందారు. అఫ్ఘాన్‌లో ఘర్షణలను కవర్ చేయడానికి రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీ తరఫున చీఫ్ ఫొటోగ్రాఫర్ దానిష్ సిద్దిఖీ కొంతకాలంగా స్పెషల్ ఫోర్సెస్‌తో కలిసి పనిచేస్తున్నారు. శుక్రవారం కూడా వారితోనే ఓ ఆర్మీ వాహనంలో ప్రయాణిస్తుండగా తాలిబన్లు మూకుమ్మడి దాడి చేశారు. ఇందులో ఓ సీనియర్ అధికారి సహా దానిష్ సిద్దిఖీ కన్నుమూశారు. పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో కాందహార్‌లోని స్పిన్ బోల్డాక్‌లో మార్కెట్ ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. అప్పటికే దానిష్‌కు ఓ ఘటనలో గాయమైంది. అయినప్పటికీ రిపోర్టింగ్ కొనసాగిస్తూనే వచ్చారు.

ఆర్మీ వాహనం వెళ్తుండగానే సమీపంలో ఓ బాంబు పేలుడు ధాటిని చిత్రించే వీడియోను పోస్టు చేసి హమ్మయ్యా బ్రతికిబయటపడ్డాం అనే తరహాలో ట్వీట్ చేశారు. దానిష్ అద్భుతమైన జర్నలిస్టు అని రాయిటర్స్ ప్రెసిడెంట్ మైఖేల్ ఫ్రీడెన్‌బర్గ్, ఎడిటర్ ఇన్ చీఫ్ అలెస్సాండ్రా గల్లోని పేర్కొంటూ ఆయన కుటుంబానికి సానుభూతిని ప్రకటించారు. “కాందహార్‌లో మిత్రుడు దానిష్ సిద్దిఖీ మరణించిన వార్త కలచివేసింది. ఇండియన్ ఫొటోజర్నలిస్టు, పులిట్జర్ ప్రైజ్ విన్నర్ అఫ్ఘాన్ బలగాలతో ఉన్నప్పుడు టెర్రరిస్టులు దాడి చేశారు. ఇందులో దానిష్ మరణించారు” అని అఫ్ఘాన్ రాయబారి ఫరీద్ పేర్కొన్నారు. రోహింగ్య శరణార్థుల సంక్షోభం డాక్యుమెంటింగ్‌కు దానిష్ సిద్దిఖీ, ఆయన సహొద్యోగి అద్నాన్ అబీది తొలిసారి భారత్ నుంచి (ఫీచర్ ఫొటోగ్రఫీకి) 2018లో పులిట్జర్ అవార్డు గెలుచుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed