కప్ కొడతారా.. భారత్ లక్ష్యం : 185

by Shyam |
కప్ కొడతారా.. భారత్ లక్ష్యం : 185
X

ఐసీసీ మహిళ టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌వుమెన్ ఇరగదీశారు. మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న మహిళా టీ20 ఫైనల్స్‌లో ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లకు 184 పరుగులు చేసింది. తొలి ఓవర్ నుంచే ఆస్ట్రేలియా ఓపెనర్లు తమ దూకుడును ప్రదర్శించారు. దీప్తి శర్మ వేసిన తొలి ఓవర్‌లో ఆసీస్ మూడు ఫోర్లు బాదిందంటే ఏ రేంజ్‌లో ఇన్నింగ్స్ ఆరంభించారో తెలుసుకోవచ్చు. కాగా ఇదే ఓవర్లో ఓపెనర్ హీలీ ఇచ్చిన క్యాచ్‌ను షెఫాలీ వదిలేసింది. దీనికి భారత జట్టు భారీ మూల్యమే చెల్లించుకుంది. ఇక అప్పటి నుంచి ఎలాంటి తప్పిదాలు చేయకుండా ఆసీస్ ఓపెనర్లు భారత బౌలర్ల భరతం పట్టారు.

ఓపెనర్ అలీసా హీలీ 75 (39 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరుపు ఇన్సింగ్స్‌కు తోడు.. మరో ఓపెనర్ మూనీ 78 (54 బంతుల్లో 10 ఫోర్లు) కడదాకా నిలిచి జట్టుకు భారీ స్కోరందించడంలో కీలక పాత్ర పోషించింది. అయితే 115 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని రాధా యాదవ్ విడగొట్టింది. హీలీ అవుటైన తర్వాత కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన భారత బౌలర్లు స్కోరు వేగాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు.

ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసిన దీప్తి..

ప్రమాదకరంగా మారిన హీలీని రాధా యాదవ్ అవుట్ చేసిన తర్వాత 17 వ ఓవర్లో దీప్తి శర్మ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసింది. ఆ ఓవర్ రెండో బంతికి కెప్టెన్ లానింగ్ (16) కొట్టిన బంతిని పాండే అద్భుతంగా క్యాచ్ పట్టడంతో లానింగ్ పెవిలియన్ చేరింది. ఇదే ఓవర్ 5వ బంతికి గార్డెనర్ స్టంప్ అవుట్‌గా వెనుదిరిగింది. ఆ తర్వాత 18వ ఓవర్ ఐదో బంతికి హేన్స్ (4) అవుట్ కావడం, బౌలర్లు పుంజుకోవడంతో ఆస్ట్రేలియా 20 ఓవర్లకు 184 పరుగులు చేయగలిగింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ (2), రాధా (1), పూనమ్ (1) వికెట్లు తీశారు.

భారత్ వరల్డ్ కప్‌ను గెలవాలంటే 20 ఓవర్లలో 185 పరుగులు సాధించాలి. ఓపెనర్ల ధాటిగా ఆడటంపైనే భారత్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.

Tags: ICC, women WT20, Healy, Radha yadav, Deepti Sharma, MCG

Advertisement

Next Story

Most Viewed