గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్

by Harish |   ( Updated:2021-10-18 06:19:24.0  )
Nirmala-Sitharaman1
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 మహమ్మారి నుంచి ఆర్థికవ్యవస్థను కాపాడేందుకు కేంద్రం ప్రకటించిన ఉద్దీపనను ఉపసంహరించే విషయంలో తొందర పడటంలేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. అవసరమైతే మరిన్ని చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఆర్థిక మంత్రి వార్షిక జీ30 ఇంటర్నేషనల్‌ బ్యాంకింగ్‌ సెమినార్‌లో పాల్గొన్న ఆర్థిక మంత్రి.. ‘ఆరోగ్య మౌలిక సదుపాయాల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. మూలధన వ్యయం, మౌలిక సదుపాయాలపై ప్రభుత్వ వ్యయాన్ని కొనసాగిస్తున్నాం. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంపై ఆందోళన ఉందని, ఆర్థిక వ్యవస్థను వీలైనంత త్వరగా సాధారణ స్థాయికి తెచ్చేందుకు కొంత అనిశ్చితిని ఎదుర్కొనక తప్పదని భావిస్తున్నామని’ పేర్కొన్నారు. కరోనా సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రపంచవ్యాప్తంగా అన్ని ఆర్థికవ్యవస్థల నుంచి సహకారం అవసరమని భావిస్తున్నామని, కరోనా టీకా తయారీకి వాడే ముడిసరుకుల తరలింపు కోసం సరఫరా వ్యవస్థను నిరంతరం కొనసాగించాలని కోరారు. అలాగే, గ్లోబల్ లీడర్లు, ఇన్వెస్టర్లతో జరిగిన సమావేశంలో ఆర్థిక మంత్రి పాల్గొన్నారు. భారత్‌లో పెట్టుబడిదారులు, పరిశ్రమలకు అవకాశాలను సృష్టించేందుకు ఆర్థిక ప్రయోజనాలతోపాటు మౌలిక సదుపాయాల్లో విదేశీ పెట్టుబడులను సులభతరం చేసేందుకు అనేక సంస్కరణలు చేపట్టినట్టు చెప్పారు. దేశీయంగా డిజిటలైజేషన్ మెరుగ్గా కొనసాగుతుందన్నారు. ఇందులో ఫిన్‌టెక్ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. భారత్‌లో మెరుగైన అవకాశాలు ఉన్నాయని, ఈ ఏడాది 16 కంపెనీలు యూనికార్న్ హోదాను పొందాయని ప్రస్తావించారు. ఈ కంపెనీలు ప్రాథమిక మార్కెట్ల నుంచి గణనీయంగా నిధులను సేకరిస్తున్నాయని అన్నారు.

Advertisement

Next Story