ఆ టాబ్లెట్లు మూడురెట్లు ఎక్కువే ఉన్నాయి : కేంద్ర ఆరోగ్య శాఖ

by Shyam |

న్యూఢిల్లీ : హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలపై ఆందోళన వద్దని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ అన్నారు. మనకు అవసరమున్నవాటి కంటే మూడు రెట్లు అధికంగానే ఆ ట్యాబ్లెట్లు ఉన్నాయని తెలిపారు. వచ్చే వారం మనకు ఒక కోటి హైడ్రాక్సీ క్లోరోక్విన్ ట్యాబ్లెట్లు అవసరమవుతాయని తెలిపిన ఆయన.. ఆ అవసరానికి మించి మూడు రెట్లు అధికంగా 3.28 కోట్ల మాత్రలున్నాయని చెప్పారు. అంటే నెలకు సరిపడా ఈ ట్యాబ్లెట్లున్నాయని పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఆరోగ్య సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించిన ఘటనలు ముందుకు వచ్చిన నేపథ్యంలో ఆయన.. వైద్యులు, వైద్య సిబ్బందితో దురుసుగా ప్రవర్తించరాదని అన్నారు. లైట్లు, క్యాండిల్స్ వెలిగించి కృతజ్ఞతలు తెలపడం కాదు.. వారితో సరిగ్గా ప్రవర్తించి గౌరవాన్ని ప్రదర్శించండని సూచించారు. కాగా, కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రకటించిన రూ. 15వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేస్తారని, ఆ నిధులతో కొవిడ్ 19ను ఎదుర్కొనేందుకు ఆస్పత్రులు సిద్ధం కావాలని, కావాల్సిన మందులను, పరికరాలను సమకూర్చుకోవాలని చెప్పారు.

ఒక్కరోజులో 16వేల టెస్టులు :

కొవిడ్ 19 టెస్టులను విరివిగా చేపడుతున్నట్టు ఐసీఎంఆర్ తెలిపింది. నిన్న ఒక్కరోజే 16,002 కరోనా పరీక్షలు జరిపినట్టు ఐసీఎంఆర్ ప్రతినిధి వెల్లడించారు. ఇందులో కేవలం 0.2శాతం మాత్రమే పాజిటివ్ కేసులు వెలుగుచూశాయని తెలిపారు. అంతేకాదు, దేశవ్యాప్తంగా కరోనాటెస్టులను వేగవంతంగా భారీగా జరపుతామని పేర్కొన్నారు. ఇప్పటివరకు 1,44,910 శాంపిళ్లను పరీక్షించినట్టు వివరించారు. కాగా, దేశంలో చిక్కుకున్న 20,743 మంది విదేశీయులను వారి స్వస్థలాలకు విజయవంతంగా పంపించినట్టు విదేశాంగ వ్యవహారాల శాఖ ప్రతినిధి వెల్లడించారు. ఈ ప్రక్రియ ఇంకా జరుగుతున్నదని తెలిపారు. కాగా, పలుదేశాల్లో లాక్‌డౌన్‌ల కారణంగా మనదేశస్తులు ఎంత మంది విదేశాల్లో చిక్కుకున్నారన్న ప్రశ్నకు ఆయన స్పష్టమైన సమాధానమివ్వలేదు. అయితే, అలా చిక్కుకున్నవారి సంక్షేమాన్ని చూసేందుకు ఆయా దేశాల్లోని మన దేశ అంబాసిడర్లు ఎప్పుడూ జాగరూకతగా ఉన్నారని వివరించారు.

Tags: health ministry, cases, deaths, hcq, sufficient, tests, icmr, standed

Advertisement

Next Story