ఏపీలో రాత్రికి రాత్రే కేసులు పెరిగిపోతున్నాయి

by srinivas |
ఏపీలో రాత్రికి రాత్రే కేసులు పెరిగిపోతున్నాయి
X

ఆంధ్రప్రదేశ్ రాత్రి ముగిసి తెల్లవారే సరికి కరోనా కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్నాయి. నిన్న ఒక్క రోజే 43 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఏపీలో ఆందోళనకు కారణమైంది. ఆదివారం నుంచి ఏపీలో కరోనా జోరు పెంచింది. కేసులు అంతకంతకూ పెరుగుతూ రాష్ట్ర వాసులను భయాందోళనలకు గురి చేస్తోంది. ఆది వారం ఉదయం నాటికి ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 23 కేసులు మాత్రమే నమోదయ్యాయి.

ఆ రాత్రి నుంచి కేసులు పెరిగాయి. ఒక్కసారికి పదుల సంఖ్యలో కరోనా కేసులు బయటపడడం ఆరంభించాయి. సోమవారం ఉదయానికి 40 కేసులు రాత్రికి 43కి చేరుకున్నాయి. మంగళవారం సాయంత్రానికి వీటి సంఖ్య 58కి చేరింది. నేటి ఉదయానికి ఈ కేసులు సంఖ్య 87కి చేరింది. నిన్న రాత్రి 9 గంటల నుంచి నేటి ఉదయం 9 గంటల నాటికి 43 కొత్త కేసులు నమోదయ్యాయని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

చెక్ పోస్టులు, ప్రజల్లో చైతన్యం కరోనాను ఆపలేకపోతున్నాయి. పదుల సంఖ్యలో కేసులు నమోదు కావడం రాష్ట్ర ప్రభుత్వంతో పాటు వైద్యులను కూడా ఆందోళనకు గురిచేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో దేశంలో ఎక్కడా లేని విధంగా పటిష్ఠమైన వలంటీర్ల వ్యవస్థ చురుగ్గా ఉంది. రాష్ట్రంలోని ఏ మూల నుంచి సమాచారమైనా క్షణాల్లో ప్రభుత్వానికి చేరవేసే సైనికులు లక్షమంది ఉన్నారు. అయితే కరోనా కేసులు ప్రధానంగా పట్టణాల్లోనే నమోదవుతుండడం, అవి నెమ్మదిగా పల్లెలకు పాకుతుండడం భయానికి కారణమవుతోంది.

పట్టణాల్లో ఆంక్షలు పెట్టినా.. పల్లె వాసులు స్వచ్ఛందంగా రహదారులు మూసేశారు. ఇతరులతో సంబంధం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయనప్పటికీ కరోనా బారి నుంచి తప్పించుకోలేకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. ఏపీలోని 11 జిల్లాల్లో 87 కేసులు నమోదు కాగా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు మాత్రమే ఇంతవరకు ఈ మహమ్మారి సోకలేదని తేలుతోంది. నిన్నటి వరకు ఉభయగోదావరి జిల్లాలను ఇలాగే పేర్కొనగా ఇప్పుడా జిల్లాలు కరోనా లిస్టులో టాప్ ప్లేసును ఆక్రమించిన సంగతి తెలిసిందే.

Tags : corona virus, covid-19, andhra pradesh, increasing cases

Advertisement

Next Story