ఆకట్టుకున్న ఫల్య అరంగేట్ర కూచిపూడి ప్రదర్శన

by Shyam |
ఆకట్టుకున్న ఫల్య అరంగేట్ర కూచిపూడి ప్రదర్శన
X

దిశ, అంబర్ పేట్: ప్రముఖ నృత్య కళాకారిణి ఫల్య కూచిపూడి రంగప్రవేశంలోనే అద్భుత నృత్యంశాలు ప్రదర్శించి అందరిని ఆకట్టుకుంది. ఫల్య గుడిపూడి ప్రముఖ నాట్యాచార్యులు అజయ్ శ్రీనివాస్ చక్రవర్తి శిష్యురాలుగా కూచిపూడిలో శిక్షణ పొందింది. ఫల్య గుడిపూడి ఆదివారం రవీంద్రభారతి లో కనుల పండువగా కూచిపూడి రంగ ప్రవేశం చేసి ప్రశంసలు అందుకుంది. గత తొమ్మిదేళ్లుగా కూచిపూడి నాట్యం నేర్చుకుంటున్న ఫల్య గుడిపూడి శంకరపల్లి ఇండోస్ ఇంటర్నేషనల్ స్కూల్ లో 11వ తరగతి చదువుతోంది.

చదువులో రాణిస్తూనే మరో వైపు శాస్త్రీయ కూచిపూడి నాట్యం, క్రీడలు, ఫోటోగ్రఫీ లోను తన ప్రతిభను చాటుకుంటోంది. గణపతి ని స్తుతిస్తూ అరగేంట్రం ప్రారంభించిన ఫల్య పద్మభూషణ్ వెంపటి చిన సత్యం నృత్య కల్పన చేసిన “మరకత మణి మాయ చేలా” అంశాన్ని ఎంతో పరిణతతో ప్రదర్శించి ఆకట్టుకుంది. రాగమాలికలో శ్రీరామ పదం, శివరంజని లో సమకూర్చిన మహేశ్వరీ మహాకాళీ అంశాలను రసరమ్యంగా ప్రదర్శించింది. స్మర సుందరాంగుణి అంటూ ఉల్లాసంగా జావళి ప్రదర్శించి అలరించింది.

కేంద్ర సంగీత నాటక అకాడమీ సభ్యులు డాక్టర్ తాడేపల్లి, తెలంగాణ సిఐడి డిఐజి ఎ.వి.రఘునాథ్, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, ప్రముఖ ఛాయగ్రాహకులు అరవింద్ ఛేంజి అతిధులుగా విచ్చేసి ఫల్య గుడిపూడి ని అభినందించారు. నట్టువాంగం గురు అజయ్ శ్రీనివాస్ చక్రవర్తి చేయగా, కౌశిక్ కళ్యాణ్ గాత్రం, జయకుమార్ వయోలిన్, దత్తాత్రేయ వేణువు, సుధాకర్ రాయప్రోలు వీణ, శివకుమార్ ఘటం తో సంగీతాన్ని అందించి రక్తి కట్టించారు. కార్యక్రమంలో కేశవ సిద్ధార్ధ గుడిపూడి రాఘవేంద్రరావు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed