మట్టి నుంచి ఇసుక తీస్తున్న వ్యాపారులు.. లైట్ తీసుకున్న అధికారులు

by Sumithra |
మట్టి నుంచి ఇసుక తీస్తున్న వ్యాపారులు.. లైట్ తీసుకున్న అధికారులు
X

దిశ, కామారెడ్డి రూరల్: మట్టి నుంచి ఇసుక తీయడం ఓ పెద్ద శ్రమగా భావించేవారు. కానీ, వీరు మాత్రం అతి సులువుగా మట్టి నుంచి ఇసుకను తీసేస్తున్నారు. అది ఎలాగో చూడాలంటే కామారెడ్డి మండలం గూడెం గ్రామానికి వెళ్లాల్సిందే.

కామారెడ్డి మండలం గూడెం గ్రామంలో ఎర్రమట్టి, మొరం మట్టిని కుప్పలుగా పోసి, వాటిని ఎండబెట్టి, బోరు మోటర్ ద్వారా ఫిల్టర్ చేసి, వాటి నుంచి ఇసుకను వేరు చేస్తున్నారు. ప్రభుత్వం వ్యవసాయానికి ఉచితంగా సరఫరా చేసే కరెంటును వినియోగించుకొని బోరు మోటార్ల ద్వారా నీటిని పంపింగ్ చేస్తూ ఎర్ర మట్టి, మొరం నుంచి ఇసుక‌ను ఫిల్టర్ చేస్తున్నారు. ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టడమే కాకుండా అమాయక ప్రజలను మోసగిస్తూ నాణ్యతలేని ఇసుక వ్యాపారం చేస్తున్నారు. ఇక అక్రమార్కుల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతోంది.

స్థానిక రెవెన్యూ, మైనింగ్ డిపార్ట్‌మెంట్ అధికారులకు తెలిసినప్పటికీ చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుండడంతో వీరి వ్యాపారం అడ్డూ అదుపు లేకుండా కొనసాగుతోంది. ఓ వైపు భారీ వర్షాలు పడి వాగులు, కాలువల్లో నీరు పుష్కలంగా ఉండడంతో ఇసుక తవ్వడం పెద్ద సమస్యగా మారింది. దీంతో వారికి ఉపాయం తట్టింది. అదే మట్టిలో నుంచి ఇసుకను ఫిల్టర్ చేయడం. అనుకున్నదే తడవుగా తమ చేలలో నుండి మట్టిని సేకరించి బోరు బావుల వద్ద కుప్పలుగా పోస్తారు. అది కాస్త ఎండిన తర్వాత దానిని తీసి ట్రాక్టర్లలో పోసి బోరు బావుల ద్వారా వచ్చే నీటితో ఫిల్టర్ చేస్తారు. ఫిల్టర్ చేయగా వచ్చిన మట్టిని ఇసుకగా ప్రజలకు విక్రయించి సొమ్ము చేసుకుంటారు. ఇది ఆ గ్రామంలో నిత్యకృత్యంగా సాగుతున్న దర్జా వ్యాపారం. ఈ వ్యాపారం గురించి అధికారులకు తెలిసినప్పటికీ చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇదేదీ తెలియని అమాయక ప్రజలు ఇసుకను రూ. 6500 నుంచి రూ. 8000 వరకు డబ్బులు వెచ్చించి కొనుగోలు చేస్తూ మోసపోతున్నారు. దీనిని కట్టడి చేయాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రజల్లో వారిపై చులకన భావం ఏర్పడుతుంది.

వృథా అవుతున్న ఉచిత విద్యుత్

పంటలు పండించుకునేందుకు ప్రభుత్వం రైతులకు అందజేస్తున్న ఉచిత విద్యుత్ కొంతమంది అక్రమ వ్యాపారులకు వరంగా మారింది. దీంతో ప్రభుత్వానికి భారీ నష్టం వాటిల్లుతోంది. ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పొడుస్తూ ఉచిత విద్యుత్‌ను అక్రమ మార్గంలో వాడుకుంటూ వ్యాపారులు లక్షలు గడిస్తున్నారు. న్యాయంగా రైతులకు అందాల్సిన ఉచిత విద్యుత్‌ను అక్రమ ఇసుక ఫిల్టర్‎కు వాడుకుంటూ దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఈ విషయం తెలిసినప్పటికీ స్థానిక ట్రాన్స్‌కో అధికారులు ముడుపులు తీసుకుంటూ చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఈ వ్యాపారానికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Advertisement

Next Story

Most Viewed