ప్రతిరోజూ వీళ్లకు ఫుల్లు డబ్బులు.. ఎలా అంటే..?

by  |
ప్రతిరోజూ వీళ్లకు ఫుల్లు డబ్బులు.. ఎలా అంటే..?
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: అది నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం సుంకేట్ గ్రామం. ఆ గ్రామం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న బాల్కొండ నియోజకవర్గంలో ఉంది. అక్కడ సర్కారు ఇటీవల ఇసుక రీచ్‌కు అనుమతి ఇచ్చింది. దాంతో అక్కడ్నుంచి ప్రభుత్వం చేపడుతున్న డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులకు ఇసుకను తరలించొచ్చు. ఈ ఇసుక కోసం నిబంధనల ప్రకారం రూ.900 డీడీ చెల్లించాలి. అలా చెల్లించిన వారికి టీఎస్ఎంఐడీసీ ఇసుకను సరఫరా చేస్తుంది. కానీ, అక్కడ వీడీసీ(గ్రామ అభివృద్ధి కమిటీ)లు పెత్తనం చెలాయిస్తున్నాయి. లోడ్‌కు రూ.1,500 చెల్లిస్తేనే ట్రాక్టర్ ద్వారా ఇసుక తీసుకుపోయిందేకు అనుమతినిస్తున్నాయి.

ఆర్మూర్ ఎమ్మెల్యే అశన్నగారి జీవన్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న నందిపేట్ మండలంలోని మగ్గిడి, తల్వేధ, కోండూర్ గ్రామాలలో కూడా సర్కారు టీఎస్ఎండీసీల ద్వారా కేటాయించిన ఇసుక రీచ్‌లు ఉన్నాయి. ఇక్కడ కూడా వీడీసీలు ట్రాక్టర్ ద్వారా ఇసుక తరలింపునకు లోడ్‌కు రూ.1,000 ముక్కు పిండి వసూలు చేస్తున్నాయి. ఈ వీడీసీలపై ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోవడం లేదు.

బహిరంగంగా వసూళ్లు..

ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి ఇసుక రీచ్‌ల నుంచి ఇసుక తరలింపును ఎవరూ అడ్డుకోవద్ధు అని ఇటీవల ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల కలెక్టర్‌లు అదేశాలు జారీ చేశారు. అయినా ఆ అదేశాలను బేఖాతరు చేస్తు అయా గ్రామాలలో వీడీసీలు ఇసుక రీచ్‌లు ఉన్నచోట తమ పెత్తనం కొనసాగిస్తూనే ఉన్నాయి. వీడీసీల అనుమతులు లేకుండా రెండు జిల్లాల పరిధిలో ఇసుక రోడ్డెక్కడం అసాధ్యంగా ఉన్నది. వారి మాట పవర్‌ఫుల్. వారు ఏ పార్టీకి, అధికారులకు వినరు. బహిరంగంగా, బలవంతంగా వారు డబ్బులు వసూలు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. వీడీసీలపై అసలు కేసులు నమోదు కావడం లేదు. పాలకుల ఆదేశాల మేరకే అధికారులు ఈ వ్యవహారాలను చూసీచూడనట్లుగా ఉంటున్నారని ఆరోపణలు ఉన్నాయి.

బుధ, శుక్రవారాల్లో తవ్వకాలు..

తెలంగాణ జిల్లాల్లో గోదావరి, మంజీర నదీ పరివాహక ప్రాంతాలలో ఇసుక క్వారీలు ఉన్నాయి. కానీ, వాటిలో నుంచి ఇసుక తవ్వకాలకు సర్కారు అనుమతి ఇవ్వలేదు. అభివృద్ధి పనులకు, సంక్షేమ కార్యక్రమాలకు మాత్రం కొన్ని ఇసుక పాయింట్లను(రీచ్‌లు) కేటాయించింది. వాటిలో ప్రతి వారంలో బుధ, శుక్రవారాల్లో అక్కడ ఇసుకను తవ్వి తీసుకెళ్లొచ్చు. తెలంగాణ వచ్చిన తర్వాత ఇసుక క్వారీలను నిషేధించింది. టీఎస్ఎండీసీ ద్వారా కేటాయించిన రీచ్‌ల ద్వారా ఇసుకను తవ్వి అమ్మడానికి అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో సర్కారుకు పన్నులు, కిరాయిదారులకు కిరాయి చెల్లించినప్పటికీ వీడీసీలు అదనంగా డబ్బులు గుంజడం సరికాదని పలువురు అంటున్నారు.

సుంకేట్ వీడీసీపై చర్యలు తీసుకోవాలి: మోర్తాడ్ ఎంపీపీ శివలింగ్ శ్రీనివాస్

నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ మండలంలోని సుంకేట్ పెద్ద వాగును టీఆర్ఎస్ సర్కారు ఇసుక పాయింట్‌గా గుర్తించింది. నూతన ఇసుక పాలసీ విధానంలో భాగంగా అతి తక్కువ ధరకు అభివృద్ధి పనులకు నిరుపేదల ఇండ్ల నిర్మాణాలకు, వ్యక్తిగత నిర్మాణం పనులకు అందించేందుకు శ్రీకారం చుట్టి అమలు చేస్తోంది. తొమ్మిది వందల రూపాయలు డీడీ ద్వారా చెల్లించి ట్రాక్టర్ ద్వారా ఇసుక తీసుకువెళ్లొచ్చు. కానీ, ఇసుక పాయింట్ వద్ద వీడీసీ సభ్యులు బైఠాయించి ఒక ట్రాక్టర్‌కు 1,500 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు. ఆ డబ్బుతో వారు విందులు, వినోదాలు చేసుకుంటున్నారు. గ్రామ అభివృద్ధికి ఉపయోగించడం లేదని తెలుస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న నూతన ఇసుక పాలసీ విధానం వీడీసీ సభ్యుల ఆగడాల వల్ల అభాసుపాలు అవుతున్నది. వీడీసీలపై చర్యలు తీసుకోవాలని గత గురువారం జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో తిమ్మాపూర్ టీఆర్ఎస్ ఎంపీటీసీ ఆస్మ అజారుద్దీన్, నేను, తహసీల్దార్ శ్రీధర్ ,ఎంపీడీవో శ్రీనివాసరెడ్డికి వినతి పత్రం సమర్పించాం.


Next Story

Most Viewed