కుంటలు, చెరువులు కబ్జా.. అధికారుల నిర్లక్ష్యంతో రెచ్చిపోతున్న అక్రమార్కులు

by Disha Web Desk 9 |
కుంటలు, చెరువులు కబ్జా.. అధికారుల నిర్లక్ష్యంతో రెచ్చిపోతున్న అక్రమార్కులు
X

అధికారుల అలసత్వం, పాలకుల పర్యవేక్షణ లోపంతో శంకరపట్నం మండలంలో ఆక్రమణదారులు రెచ్చిపోతున్నారు. కొత్తగట్టు గ్రామ పరిధిలోని చెరువులు, కుంటలను ఆక్రమిస్తూ సాగు చేస్తున్నారు. ఆక్రమణదారులు అడ్డూ అదుపు లేకుండా ఆక్రమించుకోవడంతో ఆ గ్రామంలో సాగు, తాగునీరు అందిస్తు భూగర్బ జలాలను అడుగంటకుండా కాపాడుతున్న చెరువులు, కుంటలు కనుమరుగవుతున్నాయి. ఆక్రమణకు గురవుతున్న చెరువులు, కుంటలను కాపాడాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.

దిశ, శంకరపట్నం: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని కొత్తగట్టు గ్రామంలో వ్యవసాయ రైతుల సాగు, ప్రజల తాగునీటి అవసరాల కోసం పూర్వకాలంలో ఏర్పాటు చేసిన గొలుసు కట్టు కుంటలన్నీ మాయమైపోతున్నాయి. ఎకరాలలో ఉన్న కుంటలు కూచించుకుపోయి చిన్నపాటి బొందలుగా మారిపోయాయి. ఈ గ్రామంలో గల వెలమలకుంట 75 సర్వే నంబర్ 10 .0.1 ఎకరాల విస్తీర్ణం, అయ్యోరుకుంట 1.౦౩ ఎకరాలు, సర్వే నంబర్ ౪౩౧ లోని చింతలకుంట 6.20 గుంటల విస్తీర్ణం, భూర్ కుంట, గోసరికుంటల రూపురేఖలు మారిపోయాయి. ఎవరి ఇష్టానుసారంగా వాళ్లు కుంటలను ఆక్రమించుకొని చదును చేసి సాగు చేసుకుంటున్నారు.

అడిగే వారు, అడ్డుకునేవారు అంతకన్న లేకపోవడంతో ఇష్టానుసారంగా కుంటలను ఆక్రమిస్తున్నారు. చెరువులు, కుంటల పక్కన ఉన్న రైతులు తమ భూములను ఆనుకుని ఉన్న గొలుసుకట్టు చెరువులు, కుంటలను వారి భూముల్లో కలుపుకుని సాగు చేస్తున్నారు. దీనివల్ల కుంటల, చెరువుల విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోతుంది. దీనివల్ల వర్షాకాలంలో చెరువులు, కుంటలలో నీళ్లు నిలువని పరిస్థితి ఏర్పడుతుంది. తద్వారా భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. కుంటలు, చెరువులలో నీళ్లు ఉన్నప్పుడు భూగర్భ జలాలు సమృద్ధిగా ఉంటాయి.

కానీ కుంటలు, చెరువులు ఆక్రమణకు గురై చదును చేసి సాగు చేయడంతో విస్తీర్ణం తగ్గి నీరు నిల్వ సామార్థ్యం తగ్గుతుంది. దీంతో భూగర్భ జలాలు అడుగంటే పరిస్థితి నెలకొన్నది. ఇప్పటికైనా మండల రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించి ఆక్రమణకు గురవుతున్న గొలుసు కట్టు చెరువులు, కుంటలను కాపాడాలని రైతులు కోరుతున్నారు. వెంటనే చెరువు భూములకు హద్దులను నిర్ణయించి ఆక్రమణకు గురికాకుండా చేయాలని కొత్తగట్టు గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంపై శంకరపట్నం తహశీల్దార్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.



Next Story