దేశంలో 8శాతం తగ్గిన హిందూ జనాభా

by Dishanational6 |
దేశంలో 8శాతం తగ్గిన హిందూ జనాభా
X

దిశ, నేషనల్ బ్యూరో: 1950-2015 మధ్య భారతదేశంలో మెజారిటీ మతంగా ఉన్న హిందువుల జనాభా 7.8 శాతం తగ్గింది. అనేక పొరుగు దేశాల్లో మాత్రం మెజారిటీలుగా ఉన్న ముస్లింల జనాభా పెరిగింది. ఈ విషయాన్ని ప్రధానమంత్రి ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ అధ్యయనం తెలిపింది. భారతదేశంలో హిందూ జనాభా తగ్గిపోగా, ముస్లిం, క్రిస్టియన్, బౌద్ధ, సిక్కులతో సహా మైనారిటీ వాటా పెరిగిందని చెప్పింది. అయినప్పటికీ జైనులు, పార్సీల సంఖ్య తగ్గినట్లు వెల్లడించింది. 1950-2015 మధ్య దేశంలో ముస్లిం జనాభా వాటా 43.15 శాతం పెరిగిందని, క్రైస్తవుల్లో 5.38 శాతం, సిక్కులు 6.58 శాతం పెరిగాయని నివేదికలో తేలింది.

ఈఏసీ-పీఎం నివేదిక ప్రకారం, భారతదేశంలో హిందువుల వాటా 1950లో 84 శాతం ఉంటే 2015లో 78 శాతానికి తగ్గింది. కానీ, ముస్లింల జనాభా మాత్రం 9.84 శాతం నుంచి 14.19 శాతానికి పెరిగినట్లు ఈ నివేదిక తెలిపింది. భారత్‌లోనే కాకుండా నేపాల్ లో మెజారిటీ మతంగా ఉన్న హిందువుల జనాభాలో 3.6 శాతం క్షీణత ఏర్పడిందంది. మే 2024లో విడుదల చేసిన ఈ అధ్యయనం, ప్రపంచవ్యాప్తంగా 167 దేశాలను ట్రెండ్స్‌ని అంచనా వేసింది. త్రైమాసికాల వారీగా అందుబాటులో ఉన్న డేటాను జాగ్రత్తగా ఈ నివేదికలో విశ్లేషించారు. భారత్‌లో మైనారిటీలను రక్షించడమే కాకుండా.. వారు అభివృద్ధి చెందుతున్నారని అధ్యయనం చేపట్టిన వ్యక్తులు తెలిపారు.

ఇదిలా ఉంటే భారత్ సరిహద్దు దేశాల్లో జనాభా పెరిగింది. ముస్లిం మెజారిటీ దేశాలుగా ఉన్న పాక్, బంగ్లాదేశ్‌లో ముస్లింలు పెరిగాయని తెలిపింది. బంగ్లాదేశ్‌లో అత్యధికంగా 18.5 శాతం, పాకిస్థాన్‌లో 3.75 శాతం, ఆఫ్గాన్ లో 0.29 శాతం పెరిగింది. ఇదిలా ఉంటే మరో పొరుగు దేశమైన మయన్మార్‌లో మెజారిటీ కమ్యూనిటీల వాటా క్షీణించింది. మయన్మార్ లో థెరవాడ బౌద్ధుల మెజారిటీ జనాభా ఈ 65 ఏళ్లలోనే 10 శాతం తగ్గింది. ఇక మాల్దీవుల్లో మెజారిటీలుగా ఉన్న షఫీ సున్నీల వాటా 1.47 శాతం క్షీణించింది. ఇక భారత పొరుగు దేశాలైన భూటాన్, శ్రీలంకలో మెజారిటీ బౌద్ధ జనాభా వరసగా 17.6 శాతం, 5.25 శాతం పెరిగింది.

మొత్తం జనాభాలో మైనారిటీల నిష్ఫత్తిలో మార్పు దేశంలో మైనారిటీల స్థితిని తెసుకునేందుకు పనిచేస్తుందని పేర్కొంది. ఇది మైనారిటీల పాలసీల రూపకల్పనను ప్రోత్సహిస్తుందని.. ప్రపంచవ్యాప్తంగా ఇదో అరుదైన పద్ధతి అని అధ్యయనం తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా భారత్ మాత్రమే కాకుండా ఇతర దేశాల్లోనూ మెజారిటీ వాటా క్షీణిస్తున్నట్లు అధ్యయనంలో తేలింది. ఆస్ట్రేలియా, చైనా, కెనడా, న్యూజిలాండ్ వంటి దేశాలు, తూర్పు ఆఫ్రికా దేశాల్లో మెజారిటీ కమ్యూనిటీ వాటా భారత్ కన్నా ఎక్కువగా పడిపోయింది. 1950-2015 నుండి 167 దేశాలలో మెజారిటీ మతపరమైన తెగల వాటా సగటున 22 శాతం తగ్గింది. లైబీరియాలో 99 శాతం తగ్గితే, నమీబియాలో 80 శాతం మెజారిటీల జనాభా పెరిగింది. 123 దేశాల్లో మెజారిటీ కమ్యూనిటీలు తగ్గినట్లు ఈ అధ్యయనం ద్వారా తేలింది.

Next Story