రాష్ట్ర కాంగ్రెస్ ‘ఎక్స్’ అకౌంట్ హ్యాక్.. ప్రొఫైల్ పేరులోకి ‘టెస్లా’!

by Hajipasha |
రాష్ట్ర కాంగ్రెస్ ‘ఎక్స్’ అకౌంట్ హ్యాక్.. ప్రొఫైల్ పేరులోకి ‘టెస్లా’!
X

దిశ, నేషనల్ బ్యూరో : అసోం కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ (ఎక్స్) అకౌంట్ బుధవారం తెల్లవారుజామున హ్యాక్ అయింది. హ్యాకర్లు కాంగ్రెస్ పార్టీ అకౌంటు ప్రొఫైల్ పేరును మార్చేశారు. ‘టెస్లా ఈవెంట్’ అనే ప్రొఫైల్ నేమ్‌ను సెట్ చేశారు. ప్రొఫైల్ పిక్చర్‌లో అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లా లోగోను పెట్టారు. దీనిపై అసోం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సోషల్ మీడియా, ఐటీ విభాగాల ఛైర్మన్ రతుల్ కలితా గౌహతిలోని భంగాగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ‘‘మా పార్టీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ హ్యాకింగ్ బారిన పడింది. ప్రస్తుతానికి దాని పునరుద్ధరణ జరిగింది. అది పూర్తి స్థాయిలో భద్రంగా ఉందా లేదా అనేది నిర్ధారించడానికి రివ్యూలో పెట్టాం’’ అని తెలుపుతూ అసోం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ బుధవారం మధ్యాహ్నం ఓ ట్వీట్ చేసింది. ‘‘మమ్మల్ని మాట్లాడకుండా చేసేందుకు రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నింది. ఈ నిశ్శబ్దం మమ్మల్ని నిరోధించలేదు. మేం మా సూత్రాలకు కట్టుబడి ఉంటాం. నిజం మాట్లాడే దిశగా మా పోరాటాన్ని కొనసాగిస్తాం’’ అని పేర్కొంది. దురుద్దేశపూరితంగా హ్యాకింగ్‌కు తెగబడిన నిందితుడిని అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది.

Advertisement

Next Story