అసలు పేరులో ఏముంది ?

by Dishanational6 |
అసలు పేరులో ఏముంది ?
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలో నగరాల పేర్ల మార్పుపై బాంబే హైకోర్టు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. పేరులో ఏముంది? గులాబీని ఏ పేర్లతో పిలిచినా దాని పరిమళం తొలగిపోదని పేర్కొంది బాంబే హైకోర్టు ధర్మాసనం. పేర్ల స్వభావంపై విలియం షేక్ స్పియర్ రోమియో జూలియల్ నాటకంలోని లైన్లను ఉటంకిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. పేర్ల స్వభావంపై షేక్ స్పియర్ డీప్ స్టడీ చేశారని.. పేరు దేనినీ మార్చదని పేర్కొంది. నగరాల పేర్లు మారుస్తూ మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వేసిన పిటిషన్లను కొట్టివేసింది బాంబే హైకోర్టు.

ఔరంగాబాద్‌ జిల్లాను ఛత్రపతి శంభాజీనగర్‌గా, ఉస్మానాబాద్‌ను ధరాశివ్‌గా మారుస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ లో తాము ఎలాంటి జోక్యం చేసుకోబోమని హైకోర్టు సీజే జస్టిస్ దేవంద్రకుమార్ ఉపాధ్యాయ. జస్టిస్ ఆరిఫ్ డాక్టర్లతో కూడిన బెంచ్ పేర్కొంది. ఇదో మెరిట్ లేని పిటిషన్ అని వ్యాఖ్యానించింది.

ఔరంగాబాద్, ఉస్మానాబాద్ పేర్లను మార్చే నిర్ణయం తీసుకునే ముందు మహా సర్కార్ చట్టబద్ధమైన నిబంధనలు అనుసరించిందని పేర్కొంది. ఇందులో ఎలాంటి సందేహంలేదంది. మహారాష్ట్ర ల్యాండ్ రెవెన్యూ కోడ్ ప్రకారం.. ఏదైనా రెవెన్యూ ప్రాంతాన్ని రద్దు చేయడానికి లేదా ఆ ప్రాంతం పేరు మార్చేందుకు ప్రభుత్వానికి అనుమతి ఉంటుందని తీర్పులో పేర్కొంది. ప్రతిపాదించిన పేరు దారుణంగా ఉంటే తప్పా.. ఒక నిర్దిష్ట వస్తువు లేదా ప్రదేశాన్ని ఏ పేరుతో తెలుసుకోవాలనేది న్యాయపరంగా సమీక్షించలేమని వ్యాఖ్యానించింది కోర్టు.

2022లో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర మంత్రివర్గం ఔరంగాస్`బాద్ పేరును ఛత్రపతి శంభాజీనగర్‌గా, ఉస్మానాబాద్‌ను ధరాశివ్‌గా మార్చింది. ఫిబ్రవరి 2023లో ఔరంగాబాద్ మరియు ఉస్మానాబాద్ పేర్లను మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.

ఛత్రపతి శంభాజీనగర్‌గా మార్చాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఔరంగాబాద్ వాసులు అనేక పిటిషన్లు దాఖలు చేశారు. అలానే, ఉస్మానాబాద్‌కు ధరాశివ్‌గా పేరు మార్చాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా 17 మంది నివాసితులు మరో పిల్ దాఖలు చేశారు. ప్రభుత్వ నిర్ణయం 'రాజకీయ ప్రేరేపితం' అని రెండు పిటిషన్‌లు పేర్కొన్నాయి. ఈ పిటిషన్లను కొట్టివేసింది బాంబే హైకోర్టు.

Next Story