రూ.2 కోట్ల విలువజేసే ప్రభుత్వ భూమిపై ‘రియల్’ కన్ను.. వెంటనే స్పందించిన అధికారులు

by Disha Web Desk 2 |
రూ.2 కోట్ల విలువజేసే ప్రభుత్వ భూమిపై ‘రియల్’ కన్ను.. వెంటనే స్పందించిన అధికారులు
X

దిశ, ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని 6వ వార్డు పరిధిలో సుమారు రూ.2 కోట్ల పైచిలుకు విలువజేసే అసైన్మెంట్ భూమిని రక్షించాలని వచ్చిన ఫిర్యాదుకు అధికారులు స్పందించారు. ఈ మేరకు శుక్రవారం ఆ ప్రభుత్వ భూమిలో హద్దు రాళ్లు పాతారు. అనంతరం పూర్తిస్థాయి విచారణ చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. కోటార్మూర్‌లోని 31వ సర్వేనెంబర్‌లో 9 గుంటల (1089 గజాలు) అసైన్ మెంట్ స్థలంలో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు.. ఎల్‌పీ నెంబర్ 144లో వెంచర్ వేసి అసైన్‌మెంట్‌కు చెందిన తొమ్మిది గుంటల ప్రభుత్వ భూమిని అందులో కలుపుకున్నారు. ఈ తతంగాన్ని గమనించిన పలువురు స్థానికులు రియల్ ఏస్టేట్ వ్యాపారులపై సమాచార హక్కు చట్టం ద్వారా ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదుకు వెంటనే స్పందించిన కలెక్టర్ అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు విచారణ షురూ చేశారు. మండల సర్వేయర్ షికారి రాజు, రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ (ఆర్ఐ) అశోక్ సింగ్, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి ప్రవీణ్ సంయుక్తంగా విచారణ చేశారు. అసైన్మెంట్ స్థలాన్ని గుర్తించి హద్దు రాళ్లు పాతారు. ఈ ప్రాంతంలో గజానికి రూ.20 వేల వరకు ధర పలుకుతుందని సమాచారం. అక్రమార్కుల నుంచి ప్రభుత్వ భూమిని కాపాడిన అధికారులను ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని పలువురు రాజకీయ ప్రముఖులు అభినందించారు. ఈ గుర్తించిన 9 గుంటల ప్రభుత్వ స్థలంలో ప్రజలకు ఉపయోగపడే భవనాలను నిర్మించి ప్రజలకు ఉపయోగపడేలా చేయాలని స్థానికులు కోరుతున్నారు.



Next Story

Most Viewed