ఈటల జమున హ్యాచరీస్‌లో ఆక్రమణలు నిజమే : కలెక్టర్ హరీష్

by Shyam |   ( Updated:2021-12-06 05:59:41.0  )
ETELA
X

దిశ, మెదక్: మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు చెందిన జమున హ్యాచరీస్ అసైన్డ్ భూములను ఆక్రమించిందని మెదక్ కలెక్టర్ హరీష్ ధ్రువీకరించారు. మెదక్ జిల్లా మాసాయిపేట్ మండలం హకీంపేట, అచ్చంపేట గ్రామాల శివారులో అసైన్డ్ భూముల సర్వే నెంబర్ 130,81 లలో మొత్తం 70.33 ఎకరాలలో జమున హ్యాచరీస్ యాజమాన్యం ఆక్రమించిందిని కలెక్టర్ వెల్లడించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆయన నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఈ వివరాలను తెలిపారు. నెల రోజులుగా రెవెన్యూ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్, ల్యాండ్ రికార్డ్, తూప్రాన్ ఆర్డీఓ శ్యాం ప్రకాష్‌ల ఆధ్వర్యంలో అధికారుల బృందం అసైన్డ్ భూములుపై సర్వే నిర్వహించిందని కలెక్టర్ తెలిపారు.

ఈటల జమున హ్యాచరీస్ యాజమాన్యం నిర్వహిస్తున్న పౌల్ట్రీ ఫామ్‌లో అక్రమ నిర్మాణాలు జరిగాయని తెలిపారు. వీటికి సంబంధించి ఇప్పటికే యాజమాన్యానికి నోటీస్‌లు జారీ చేసినట్లు వివరించారు. పౌల్ట్రీ ఫామ్‌కు పీసీఓ పర్మిషన్ లేదని వెల్లడించారు. అల్డివాగలో ఫ్యాక్టరీకి సంబంధించి కాలుష్య కారక వ్యర్థాలు కలుస్తున్నయని చెప్పారు. సర్వే నంబరు 77, 78, 79, 80, 81, 82, 97, 130 సర్వే నంబర్లలో 70.33 ఎకరాల్లో అసైన్డ్ భూములు జమునా హ్యాచరీస్ యాజమాన్యం అక్రమంగా ఆక్రమించిందని కలెక్టర్ స్పష్టం చేశారు. బీసీ, ఎస్టీ, ఎస్సీ, ఓసీలకు చెందిన 56 మంది కుటుంబాలకు చెందిన అసైన్డ్ భూములను అక్రమంగా ఆక్రమించారని తెలిపారు. కొన్ని సర్వే నంబర్లలో అక్రమంగా రిజిస్ట్రేషన్లు జరిగాయని గుర్తించడంతో దానిపై కూడా విచారణ జరుపుతున్నామని తెలిపారు. సర్వేకు సంబంధించి నివేదికను ప్రభుత్వానికి పంపుతున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రమేష్, తూప్రాన్ ఆర్డీఓ శ్యామ్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed