‘ఎకరానికి రూ 20 లక్షలు ఇవ్వకుంటే ఊరుకోం’

by Sridhar Babu |
‘ఎకరానికి రూ 20 లక్షలు ఇవ్వకుంటే ఊరుకోం’
X

దిశ, భద్రాచలం : సీతమ్మ సాగర్ ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న దళితులకు ఎకరానికి రూ.20 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని, లేదంటే ఊరుకునేదిలేదని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ జిల్లా చైర్మన్ చింతిరేల రవికుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మార్కెట్లో రూ.20 లక్షలు పలికే భూమికి ప్రభుత్వం రూ 8 లక్షలు ఇస్తామంటే భూములు ఇచ్చే ప్రసక్తే లేదన్నారు. ప్రభుత్వం ఇచ్చే రూ.8లక్షలతో మరోచోట ఎకరం భూమి వస్తుందా అని ప్రశ్నించారు. శనివారం ఎం కాశీనగరంలో బాధిత దళిత రైతులను కలిసిన ఆయన గిట్టుబాటు నష్టపరిహారం ఇప్పించడం కోసం కాంగ్రెస్ పార్టీ నిర్వాసిత రైతులకు అండగా నిలుస్తుందని తెలిపారు.

భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఈ విషయంలో ప్రభుత్వంతో పోరాడుతున్నారని తెలిపారు. జెసి హడావుడిగా వచ్చి సమావేశాలు పెట్టి ఎకరం మూడు లక్షలకే తీసుకోవాలని ప్రయత్నాలు చేయడం ఎంతమాత్రం సబబు కాదన్నారు. కరోనా సమయంలో హడావుడిగా మీటింగులు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని రవికుమార్ ప్రశ్నించారు. కరకట్టల వలన గ్రామాలు, పంట పొలాలు నీట మునిగే ప్రమాదం పొంచి ఉందని, వీటికి నష్టపరిహారం ఎవరిస్తారని ప్రభుత్వ అధికారులను నిలదీశారు. రైతులను బెదిరిస్తే భూములు ఇస్తారనుకోవడం అవివేకం అన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో దళితులు అనేకసార్లు మోసపోతున్నారని, ఈ విషయంలో మోసపోవడానికి సిద్ధంగా లేరని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed