ఎవరికీ లొంగను, అమ్ముడుపోను : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

by Aamani |   ( Updated:2021-07-20 08:09:25.0  )
RS Praveen Kumar
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఎవరికి అమ్ముడు పోనని.. ఎవరికి లొంగకుండా పని చేస్తానని గురుకుల విద్యాలయాల సంస్థ మాజీ కార్యదర్శి, మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి నాగోబాను దర్శించుకున్నాక.. దంతన్పల్లిలో స్వేరోస్ జాతీయ సభ్యుడు కాంపెల్లి ఊశన్న గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

సరైన సమయంలో తన కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. ఎవరి కింద పని చేయనని, ఎవరికి లొంగకుండా పని చేస్తానన్నారు. తాను ప్రభుత్వ ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నాక.. తొలిసారిగా ఆదిలాబాద్ జిల్లాకు వచ్చానని పేర్కొన్నారు. తాను ఎక్కడో తుంగభద్ర నదిలో ఈత కొట్టుకుంటూ ఉండాల్సిన వాడినని.. లారీ డ్రైవర్ కావాలనుకున్నానని, జ్ఞానం సంపాదించి ఐపీఎస్ స్థాయికి ఎదిగానన్నారు. సమాజంలో మార్పు కోసం ఐపీఎస్‌గా కాకుండా సామాన్యుడిగా ప్రజలకు సేవ చేసేందుకు వస్తున్నానని అన్నారు.

గిరిజన తల్లి నాగోబా తల్లి ఆశీస్సులు తీసుకున్నానని.. మనకు అంతా మంచే జరగాలన్నారు. రాబోయే రోజుల్లో మన కలలన్నీ నిజం కావాలని ఆకాంక్షించారు. మీరంతా కదన కుతూహలంతో కవాతు చేయాలని ఆ గిరిజన తల్లి ఆశీర్వాదం తీసుకున్నామన్నారు. మీ ప్రేమ, అభిమానం నాపై ఉండాలని.. ప్రవీణ్ కుమార్ చివరి శ్వాస వరకు మీ పిల్లలు, మీ భవిష్యత్తు, అభివృద్ధి కోసం పని చేస్తానని బాబా సాహేబ్ అంబేద్కర్ సమక్షంలో ప్రతిన తీసుకుంటానని చెప్పారు.

మన పిల్లలు, మన భవిష్యత్తు, అభివృద్ధి కోసం పూర్తి ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాల్సి ఉంటుందనని అన్నారు. ఇది చాలా ముఖ్యమైందని.. అంతా కలిసి చేయాల్సి కృషి చేయాల్సి ఉంటుందన్నారు. అడుక్కోవాల్సిన అవసరం లేదని.. చాలా చాలా కృషి చేయాల్సి ఉందన్నారు. నా పని ఇప్పుడిప్పుడే ప్రారంభమైందని.. రానున్న రోజుల్లో తాను ఏం చేస్తాననేది అందరికి చెబుతానని తెలిపారు.

Advertisement

Next Story