'నేను పార్టీ వీడడం లేదు.. నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా'

by srinivas |
నేను పార్టీ వీడడం లేదు.. నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా
X

దిశ, ఏపీ బ్యూరో: గత కొంత కాలంగా టీడీపీని వీడుతున్నానని, వైఎస్సార్సీపీలో చేరుతున్నానన్న వార్తల్లో వాస్తవం లేదని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు. తానంటే గిట్టని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ఇప్పటి వరకు మూడు సార్లు ఇలా పార్టీ మారుతున్నానంటూ ప్రచారం చేశారని, ఈ మూడు సార్లూ దానిని తప్పనే నిరూపించానని ఆయన పేర్కొన్నారు.

వైఎస్సార్సీపీపై తమ అధినేత చంద్రబాబు చేస్తున్న ప్రతి పోరాటంలో తాను ఆయనతోపాటే ఉంటున్నానని సత్యప్రసాద్ తెలిపారు. దానిని ఓర్వలేని కొందరు దుష్ప్రచారంతో తనను పార్టీకి దూరం చేయాలని కుట్రలకు పాల్పడుతున్నారని, అందులో భాగంగానే తనపై లేనిపోని పుకార్లు అల్లుతున్నారని ఆయన చెప్పారు. మార్చి 20 నుంచి నిన్నమొన్నటి వరకు తానసలు ఏపీలోనే లేనని ఆయన వెల్లడించారు. మార్చి 20 తరువాత తాను ఏపీలో ఉన్నానని కానీ, మంత్రి బాలినేనిని ఒంగోలులో కలిశానని కానీ ఎవరైనా రుజువు చేస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని అనగాని సత్యప్రసాద్ సవాల్ విసిరారు.

రాజకీయాల్లో తాయిలాలు ఆశచూపి పార్టీ మారాలని ఎంతో మంది అడుగుతుంటారన్న ఆయన, వాల్లేదో అడగ్గానే పార్టీ మారుతున్నట్టు కాదని తెలిపారు. గత వారం టీడీపీ నిర్వహించిన మహానాడులో కూడా తాను కూడా పాల్గొన్నానని చెప్పిన ఆయన, తీర్మానం ప్రవేశపెట్టిన రోజున తన సోదరుడి పుట్టినరోజు ఉండంతో పార్టీని పర్మిషన్ అడిగి గైర్హాజరయ్యానని తెలిపారు. తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తే లేదని, చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు కృషి చేస్తానని అనగాని సత్యప్రసాద్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed