ఆర్బీఐ అధికారులతో సీపీల సమావేశం

by Sumithra |   ( Updated:2021-02-05 11:26:22.0  )
ఆర్బీఐ అధికారులతో సీపీల సమావేశం
X

దిశ, క్రైమ్ బ్యూరో: డిజిటల్ రుణాల వ్యవహారంలో(యాప్ రుణాల) ఆర్‌బీఐ వర్కింగ్ గ్రూప్ అధికారులతో హైదరాబాద్ నగరంలోని మూడు పోలీస్ కమిషనరేట్ అధికారులు శుక్రవారం సమావేశం అయ్యారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్, ఇంటిలిజెన్స్ ఐజీ రాజేష్ కుమార్, హైదరాబాద్ సీసీఎస్ జాయింట్ సీపీ అవినాష్ మహాంతి, రాచకొండ సీసీఎస్ ఏసీపీ హరినాథ్‌లు ఈ సమావేవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ పద్దతుల్లో అక్రమంగా రుణాలు ఇవ్వడం, తిరిగి వసూలు చేసుకోవడానికి సంబంధించిన విషయంలో అమాయక ప్రజలు దోపిడీకీ గురవుతున్న పరిస్థితులను ఆర్బీఐ అధికారులకు పోలీసు అధికారులు వివరించారు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ ద్వారా వివిధ ఫ్లాట్ ఫారమ్‌లను ఉపయోగించి రుణాలు ఇచ్చే సంస్థల మార్గదర్శకాలను క్రమబద్దీకరించాలని సూచించారు.

రుణాలు ఇచ్చే సంస్థలన్నీ చట్టబద్దమైనవే అనే సూచికను ప్రజలు గుర్తించేలా రుణ ప్రక్రియను, చట్టపరమైన నిబంధనలు పారదర్శకంగా ఉండాలని అన్నారు. మనీ లెండింగ్ వ్యవహారంలో లావాదేవీలు కోసం ఖాతాలను ఉపయోగిస్తున్న బ్యాంకుల కేవైసీ కఠినంగా ఉండాలన్నారు. అనుమానస్పద లావాదేవీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండేలా, తగు జాగ్రత్తలు తీసుకునేలా నిరంతరం సమీక్షలు నిర్వహించాలని అన్నారు. సమావేశంలో సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఎస్ఎం విజయ్ కుమార్, శంషాబాద్ డీసీపీ ఎన్. ప్రకాశ్ రెడ్డి, రాచకొండ సైబర్ క్రైమ్ ఇన్ స్పెక్టర్ సంజయ్ కుమార్ లు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed