రాజీనామాతోనే ఎలక్షన్ కోడ్ అమల్లోకి

by Anukaran |   ( Updated:2021-09-08 01:48:20.0  )
Huzurabad
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఏదేని ఒక స్థానానికి ఎన్నికైన ప్రజా ప్రతినిధి రాజీనామా చేస్తే అది ఆమోదం పొందిన వెంటనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చేలా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ విజ్ఞప్తి చేసింది. తెలంగాణ అసెంబ్లీ 2018లో రద్దయిన వెంటనే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిందని, కానీ హుజూరాబాద్ అసెంబ్లీకి ఈటల రాజేందర్ రాజీనామా ఆమోదం విషయంలో మాత్రం అది జరగలేదని ఫోరమ్ ప్రధాన కార్యదర్శి పద్మనాభరెడ్డి ఆ లేఖలో గుర్తుచేశారు. ఎన్నికలను సజావుగా జరిపించాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్‌దేనని, రాజ్యాంగ స్ఫూర్తిని గమనంలోకి తీసుకుని అన్ని రాజకీయ పార్టీలకూ సమాన అవకాశాలు ఉండేలా వ్యవహరించాలని పేర్కొన్నారు.

హుజూరాబాద్ అసెంబ్లీకి ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకునే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల “అవును.. దళితబంధును ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే అమలు చేస్తున్నాం. దానిలో తప్పేంటి?” అని అన్నప్పుడే ఎన్నికల సంఘం సమయానుకూలమైన నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేదని, కానీ ప్రేక్షకపాత్ర వహించడంతో ఉప ఎన్నిక సజావుగా జరుగుతుందనే నమ్మకం ప్రజల్లో పోయిందని, ఎన్నికల సంఘంపైనా అనుమానం ఏర్పడిందని పేర్కొన్నారు. అధికారంలో ఉన్న పార్టీ ఎన్నికల్లో లబ్ధి కోసం ఇకపైన ఇలాంటి పథకాలను, ప్రలోభాలను తీసుకురావడానికి హుజూరాబాద్ మార్గదర్శకం అయిందని పేర్కొన్నారు.

దళితబంధు పథకాన్ని పైలట్ ప్రాతిపదికన హుజూరాబాద్‌లో అమలు చేస్తున్నట్లు పేర్కొన్న సీఎం జూన్ 12 నుంచి ఇప్పటివరకు సుమారు మూడు వేల కోట్ల రూపాయలతో కార్యక్రమాలను చేపట్టారని, ఇప్పటికే రెండు వేల కోట్ల ప్రజాధనం జిల్లా కలెక్టర్ బ్యాంకు ఖాతాలోకి బదిలీ అయిందని గుర్తుచేశారు. సుమారు ఇరవై వేల కుటుంబాలకు తలా పది లక్షల రూపాయల చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో కూడా జమ అయిందని గుర్తుచేశారు. ఇదే విషయాన్ని గతంలో రెండుసార్లు కేంద్ర ఎన్నికల సంఘానికి లిఖితపూర్వకంగా వివరించినా ఫలితం లేకపోయిందని తాజా లేఖలో నొక్కిచెప్పారు.

హైదరాబాద్ నగరంలో కోటి మందికి పైగా జనాభా ఉన్నా అందులో ఇరవై లక్షల మంది పేదవారు ఉన్నారని, వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాలు, నాలాల పక్కన నివాస కాలనీలలో నివసించే వీరికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, కానీ హుజూరాబాద్‌కు మూడు వేల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టిన ప్రభుత్వం ఈ పేదల విషయంలో మాత్రం పట్టించుకోవడంలేదని గుర్తుచేశారు. ఈ అంశాలను దృష్టిలో పెట్టుని శాసనసభ స్థానం ఖాళీ అయిన వెంటనే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చేలా నిర్ణయం తీసుకుని ప్రజల్లో పారదర్శకంగా ఎన్నికలు జరుగుతాయనే నమ్మకాన్ని కల్పించాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ పైనే ఉన్నదని పద్మనాభరెడ్డి ఆ లేఖలో పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed