- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భార్యలకు అధికారం.. భర్తల పెత్తనం!
దిశప్రతినిధి, రంగారెడ్డి: గ్రేటర్లో కార్పొరేటర్ల షాడోలదే రాజ్యం. ఇల్లు కట్టుకోవాలన్నా, ఖాళీ స్థలం కబ్జా చేయాలన్నా వారి కనుసన్నల్లోనే అంతా జరుగుతుంది. షాడోలు కరుణిస్తేనే పనులు చకచక జరుగుతాయి. కన్నెర్రజేస్తే అర్ధాంతరంగా నిలిచిపోతాయి. వీరు ప్రతీ పనికి ఓ రేటు ఫిక్స్ చేసుకొని వసూళ్లకు తెగిస్తున్నారు. పలువురు ఏకంగా అధికారులతో కలిసి అవినీతికి పాల్పడుతున్నారు. మహిళా కార్పొరేటర్ల డివిజన్లలో ఎక్కువగా భర్తల పెత్తనమే కొనసాగుతుంది. అనధికారిక కార్పొరేటర్‌గా చలామణి అవుతున్నారు. అభివృద్ధి ఊసెత్తకుండా..సమస్యల జోలికి పోకుండా కేవలం సంపాదన లక్ష్యంగా దందా సాగించడంపై స్థానిక ప్రజలు గుర్రుగా ఉన్నారు.
గ్రేటర్ హైదరాబాద్ లో మొత్తం 150 డివిజన్లు ఉన్నాయి. ఇందులో 75 డివిజన్లలో మహిళలే కార్పొరేటర్లు. అయితే వీరు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లో పురుషులదే పెత్తనం. వారు షాడో కార్పొరేటర్లుగా వ్యవహరిస్తూ వ్యవహారాలు చక్కబెడుతున్నారు. ఈ సంస్కృతి నగరంలో జోరుగా సాగుతోంది. డబ్బులు ఇవ్వకపోతే పని ముందుకు సాగే చాన్స్‌లేదని ప్రజలే ఆరోపిస్తున్నారు. సమస్యలపై స్పందించకుండా వసూళ్ల కోసం మార్గాలు అన్వేషిస్తున్నారు. అక్రమ వ్యాపారాలు, అనుమతి లేని భవన నిర్మాణ యజమానులపై షాడో కార్పొరేటర్ల కన్ను ఉంటుంది. వీరితో పాటు పలువురు కార్పొరేటర్ల బంధువులు సైతం తమ పెత్తనాన్ని కొనసాగిస్తున్నారు. దీనికి తోడు పలు డివిజన్లలో కార్పొరేటర్ల రంగంలోకి దిగి వసూళ్లకు తెగిస్తున్నారు.
కొన్ని ఉదాహరణలు..
–ఎల్బీనగర్ నియోజకవర్గంలోని ఓ కార్పొరేటర్ ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నాని గొప్పలు చెప్పుకుంటాడు. కానీ అంతర్గతంగా వసూళ్లు, కబ్జాల పరంపర కొనసాగిస్తున్నాడు. ఎక్కడైనా ఇల్లు నిర్మిస్తే అనుచరులను పంపించి వసూళ్లకు పాల్పడం ఆయన ఇలాఖలో కామన్‌గా మారింది.
–జీహెచ్ఎంసీలో క్రియాశీలకంగా పని చేస్తున్న నాయకుడి పీఏ ఆగడాలు అంతాఇంతా కాదు. కార్పొరేటర్ పీఏనే అయినప్పటికీ అనుమతులు ఇప్పించడంలో, అధికారులకు చెప్పి పనులు పరిష్కరించడంలో తమదైన ముద్ర వేసుకున్నాడు. ఇదీ ఉప్పల్ నియోజకవర్గంలోని ఓ కార్పొరేటర్ పరిస్థితి. ఇదే నియోజకవర్గంలో కార్పొరేటర్ భర్త బిల్డర్కావడంతో నిర్మాణాల్లోని లోసుగులను కనిపెట్టి బేరాలకు తెగిస్తున్నారు.
– మరో డివిజన్‌లో కార్పొరేటర్‌కు తెలియకుండా ఇంటి నిర్మాణాల కోసం ముగ్గు పోయడం, బోరు వేయడమనేది జరగదు. ముందుగా ఆయనను కలవకుండా పనులు ప్రారంభిస్తే అనుచరులను పంపి ఆపేస్తాడు. ఓ కీలక వ్యక్తికి దగ్గరి వ్యక్తినని చెప్పుకునే అతడు కార్పొరేటర్‌గా గెలిచాక తన అసలు స్వరూపాన్ని బయటపెట్టాడు.
–భార్య కార్పొరేటర్‌గా గెలిచినప్పటి నుంచి భర్త హవా మొదలైంది. అధికారిక సమావేశాల్లో సైతం వారే కనిపిస్తారు. గ్రేటర్‌లోని పలు డివిజన్లలో నిర్మించే బహుళ అంతస్తుల భవన యజమానుల వద్ద పెద్ద మొత్తంలో చేతులు మారినట్లు తెలుస్తోంది. గత ఐదేండ్లల్లో జాతీయజెండా ఆవిష్కరణకు ఆహ్వానించలేదని అధికారులతో గొడవపడని కార్పొరేటర్ భర్త ‘నీ అంతుచూస్తా’ అని డిప్యూటీ కమిషనర్‌కు బెదిరింపు. కార్పొరేటర్లు తమ అనుచరులతో వార్డు కార్యాలయాలే వసూళ్ల కేంద్రాలుగా మార్చుకున్నారు. పాఠశాల స్థలం కబ్జాచేసిన ఘనులు నగరంలో ఉన్నారు. పారిశ్రామిక వాడల్లో అక్రమ నిర్మాణాలకు అండగా నిలుస్తున్న కార్పొరేటర్లు గ్రేటర్ లో ఉన్నారు.
కార్పొరేటర్ల పాత్రతోనే అధికారుల తప్పులు..
నగరంలో జరిగే ప్రతి అక్రమాలు, అవినీతి వెనుక కార్పొరేటర్ల పాత్రే ప్రధానమని ప్రజలు వివరిస్తున్నారు. తమకు అనుకూలంగా ఉంటే ఒకరకంగా, లేకుంటే మరో రకంగా కార్పొరేటర్లు వ్యవహరిస్తున్నారు. గ్రేటర్లో ఎక్కడైనా ఖాళీ స్థలం కబ్జా జరిగినా, నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణాలు జరిగినా, బోర్లు వేసినా కారణం స్థానిక కార్పొరేటర్లు, అధికార పార్టీ నేతల అండదండలేననే విషయం బహిర్గతమవుతుంది. మరికొన్ని ప్రాంతాల్లో అధికారులనే మధ్యవర్తులుగా పెట్టి వసూళ్ల పర్వం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా ఎన్నికల్లో ఖర్చు చేసిన నగదుకు వడ్డీతో సహా వసూలు చేసుకోవడమే రాజకీయంగా మారింది. ప్రజా సేవ అనే విషయం ఎన్నికల సమయంలోనే ఆ తర్వాత అంతా మనీమయంగానే ఉంటుందని ప్రజలు వాపోతున్నారు.