చిన్నారులకు ఆమె ‘టెడ్డీ‌బేర్ మామా’

by vinod kumar |
చిన్నారులకు ఆమె ‘టెడ్డీ‌బేర్ మామా’
X

దిశ, వెబ్‌డెస్క్‌ : బాల్యంలో ఎవరు తోడుగా ఉన్నా..లేకున్నా..బొమ్మలుంటే చాలు.. పిల్లలు వాటితోనే ఆనందంగా ఆడుకుంటూ సరదాగా గడిపేస్తారు. ఇక బొమ్మల్లో ‘టెడ్డిబేర్’‌కు ప్రత్యేక స్థానముంటుంది. పడుకున్నా, ఆడుకున్నా పక్కన టెడ్డీ ఉండాల్సిందే. అయితే ఆర్థిక పరిస్థితులు, పేదరికం వల్ల చాలా మంది పిల్లలు బొమ్మల్లేని బాల్యాన్ని గడుపుతారు. హంగేరీకి చెందిన 62 ఏళ్ల వలేరియా స్మిత్ కూడా అలాంటి బాల్యం గడపగా, తనలా చిన్నతనంలో ఎవరూ బాధపడకూడదని టెడ్డీబేర్‌లను అందిస్తూ పసిమోముల్లో విరిసిన నవ్వులను చూస్తోంది.

చిన్నారుల కోసం వలేరియా స్మిత్ ఈవెంట్స్, టాయ్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తోంది. 40 ఏళ్లుగా ఆమె టెడ్డీలను కలెక్ట్ చేస్తుండగా, ఇప్పటివరకు 20 వేలకు పైగా టెడ్డీలను సేకరించింది. ఎంతోమంది చిన్నారులు ఆమె ఎగ్జిబిషన్‌లోని టెడ్డీలు, బొమ్మలతో ఆడుకుంటూ ఆనందాన్ని పొందుతుంటారు. చిన్నారుల కనుల్లోని ఆ సంతోషమే వెలకట్టలేని సంపదతో సమానమని, తన చిన్నతనంలోని బాల్యపు గాయాలను ఆ నవ్వులే నయం చేస్తున్నాయని స్మిత్ చెబుతోంది. అందుకే ఆమెను అందరూ ‘టెడ్డీ బేర్ మామా’ అని పిలుస్తారు.

‘హంగేరీలో 13 వేలకు పైగా టెడ్డీలను సేకరించి రికార్డ్ క్రియేట్ చేయగా, 2019లో 20 వేల టెడ్డీలతో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం పొందాను. ఎంతోమంది నా అడ్రస్ కనుక్కుని నాకు టెడ్డీలు పంపుతుంటారు. నేను కూడా ఎన్నో టెడ్డీలను కొంటూ ఉంటాను. నర్సరీలు, ప్రీ స్కూల్స్, పూర్ ఫ్యామిలీకి చెందిన పిల్లలకు టెడ్డీలను అందిస్తాను. చిన్నతనంలో టెడ్డీనే నేను చాలా మిస్ అయ్యాను. నా తోటి చిన్నారులు టెడ్డీతో ఆడుకుంటుంటే నాకు లేదని బాధపడేదాన్ని. అందుకే టెడ్డీ కలెక్షన్ ప్రారంభించాను. ఇప్పటికీ టెడ్డీని నేను హత్తుకుని పడుకుంటాను, దాన్నుంచి వచ్చే ప్రేమను ఆస్వాదిస్తాను’ అని స్మిత్ చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story