Jmm list: జేఎంఎం తొలి జాబితా రిలీజ్.. హేమంత్ సోరెన్ పోటీ చేసేది అక్కడి నుంచే?

by vinod kumar |
Jmm list: జేఎంఎం తొలి జాబితా రిలీజ్.. హేమంత్ సోరెన్ పోటీ చేసేది అక్కడి నుంచే?
X

దిశ, నేషనల్ బ్యూరో: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు గాను జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) తొలి జాబితాను మంగళవారం అర్థరాత్రి విడుదల చేసింది. ఈ లిస్టులో 35 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఐదుగురు మంత్రులతో సహా 21 మంది ఎమ్మెల్యేలకు మరోసారి అవకాశం కల్పించారు. ఇందులో సీఎం హేమంత్ సోరెన్, ఆయన భార్య కల్పనా సోరెన్ పేర్లు కూడా ఉన్నాయి. హేమంత్ మరోసారి బర్హెట్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనుండగా.. కల్పనా గండే నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు. హేమంత్ సోదరుడు బసంత్ సోరెన్‌కు దుమ్కా సెగ్మెంట్ నుంచి టికెట్ కేటాయించారు. హేమంత్ 2014, 2019లో బర్హెట్ స్థానం నుంచి గెలుపొందగా.. కల్పనా గండే స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించారు.

రాష్ట్రంలో జేఎంఎం నేతృత్వంలోని కూటమిలో కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ), సీపీఐఎంఎల్ పార్టీలు భాగస్వామిగా ఉన్నాయి. సీట్ షేరింగ్‌లో భాగంగా జేఎంఎం 41, కాంగ్రెస్ 30, ఆర్జేడీ 6, సీపీఐఎంఎల్ నాలుగు స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్టు హేమంత్ సోరెన్ ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే జేఎంఎం తన మొదటి జాబితాను రిలీజ్ చేసింది. కాగా, 81 మంది సభ్యులున్న జార్ఖండ్ అసెంబ్లీకి నవంబర్ 13, 20 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.

ఆర్జేడీ అభ్యర్థుల ఖరారు

అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు స్థానాల్లో పోటీ చేస్తున్న ఆర్జేడీ సైతం తమ అభ్యర్థులను ప్రకటించింది. దేవఘర్ నుంచి సురేష్ పాశ్వాన్, గొడ్డ సెగ్మెంట్ నుంచి సంజయ్ ప్రసాద్ యాదవ్ , కోడెర్మా నుంచి సుభాష్ యాదవ్, ఛత్ర నుంచి రష్మీ ప్రకాష్, విశ్రాంపూర్ నియోజకవర్గం నుంచి నరేష్ ప్రసాద్ సింగ్, హుస్సేనాబాద్ నుంచి సంజయ్ కుమార్ సింగ్ యాదవ్ పేర్లను ఖరారు చేసింది. అంతకుముందు 21 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది.

Advertisement

Next Story

Most Viewed