ఇక ముందున్నది కష్టకాలమేనా..?

by Prasanna |
ఇక ముందున్నది కష్టకాలమేనా..?
X

దిశ, న్యూస్ బ్యూరో: ప్రభుత్వానికి స్టేట్ డెవలప్‌మెంట్ లోన్స్ కింద ఎఫ్ఆర్‌బీఎం పరిధికి లోబడి తొమ్మిది నెలలకు రూ. 15,051 కోట్లు తీసుకోవచ్చని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖలోని డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎక్స్పెండేచర్ విభాగం​మార్చి 23వ తేదీన క్లారిటీ ఇచ్చింది. నెట్ బారోయింగ్ సీలింగ్‌లో యాభై శాతం మేరకు మొదటి మూడు క్వార్టర్లలో తీసుకోవచ్చని, ఆ ప్రకారం రుణాలు మంజూరు చేయాలని రిజర్వు బ్యాంకు జనరల్ మేనేజర్‌కు ఆదేశించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్-జూన్ మధ్యకాలంలో రూ. 9000 కోట్లు తీసుకోనున్నట్లు రిజర్వు బ్యాంకుకు సమాచారం ఇచ్చింది. కానీ ఇప్పటికే రూ. 12,500 కోట్లను తీసుకున్నది. ముందుగా ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ నెల 30వ తేదీన మరో రూ. 1000 కోట్లను తీసుకునే అవకాశం ఉంది. అయితే దానిపై నిర్ణయం తీసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే. తొమ్మిది నెలల కాలానికి తీసుకోవాల్సిన రుణంలో దాదాపు 83% ఇప్పుడే వాడేసినందున రానున్న ఆరు నెలల్లో కేవలం రూ. 2,551 కోట్లు మాత్రమే తీసుకునే అవకాశం ఉన్నది.

ప్రతి నెలా అప్పుల చెల్లింపు ఎలా?

రాష్ర్ట ప్రభుత్వం గతంలో చేసిన అప్పుల చెల్లింపు, వడ్డీ కింద ప్రతినెలా సుమారు రూ.3,100 కోట్లను చెల్లించాలి. ప్రభుత్వ జనరల్ ఖాతా నుంచి ఆటోమేటిక్‌గా ఆ మొత్తం కట్ అయిపోతుంది. ఉద్యోగులకు పూర్తిస్థాయిలో వేతనాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పింఛన్లు, ఆసరా పింఛన్​లకు కలిపి సుమారు మూడున్నర వేల కోట్ల రూపాయలు అవసరం పడుతుంది. రిజర్వు బ్యాంకు నుంచి తీసుకున్న రూ. 12,500 కోట్లలో రూ. 7,000 కోట్లు రైతుబంధుకే సరిపోయాయి. మిగిలిన డబ్బును ఉద్యోగుల వేతనాలు, పింఛన్లు తదితరాలకు ఖర్చు పెట్టింది.

మూడు నెలలుగా ఉద్యోగుల వేతనాలు, రిటైర్డ్ ఉద్యోగుల పింఛన్లకు 50%, 25% కోత పెట్టగా ఈ నెల నుంచి పూర్తిస్థాయిలో చెల్లించనున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు హామీ ఇచ్చినట్లు ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. ఈ నెల మొదటి నుంచి ఆంక్షలన్నీ సడలించడంతో మద్యం దుకాణాలతో పాటు షాపింగ్ మాల్స్, వస్త్ర దుకాణాలు తదితర అన్ని వ్యాపార లావాదేవీలు యథావిధిగా సాగుతున్నాయి. కానీ లాక్‌డౌన్‌కు ముందున్న తరహాలో వ్యాపారం జరగడంలేదని అటు వ్యాపారులు, ఇటు ఆర్థిక శాఖ వర్గాలూ పేర్కొంటున్నాయి. రెగ్యులర్‌గా వచ్చే ఆదాయంతో పోలిస్తే రాష్ట్ర ఎక్సైజ్, పెట్రోల్​పై వచ్చే వ్యాట్, జీఎస్టీ తదితరాలన్నీ సగం మేరకే వస్తున్నాయి. దీంతో నెలకు స్వీయ ఆర్థిక వనరులు గరిష్టంగా రూ. 8000 కోట్లు మించవన్నది ఒక అంచనా.

ఇలా సర్దుకొచ్చింది…

ప్రభుత్వం లాక్‌డౌన్ కాలంలో ఉద్యోగులకు 50% జీతాలు, ఆసరా పింఛన్లు లాంటి అన్ని అవసరాలనూ జీఎస్టీ నష్టపరిహారం ద్వారా వచ్చిన డబ్బుతో, రిజర్వు బ్యాంకు నుంచి తీసుకున్న అప్పుతో సర్దుకొచ్చింది. సరిగ్గా ఇదే సమయంలో రైతుబంధు కూడా ఇవ్వాల్సి రావడంతో ఆ అప్పుల నుంచే రూ. 7,000 కోట్లను సర్దుబాటు చేసింది. లాక్‌డౌన్ ఆంక్షలను దాదాపుగా పూర్తిస్థాయిలో సడలించడంతో స్వీయ ఆర్థిక వనరులు వస్తాయని ప్రభుత్వం కొండంత నమ్మకం పెట్టుకుంది. ఆ ప్రకారం ప్రతీ నెలా సగటున సుమారు రూ. 15,000 కోట్లు రావాల్సి ఉంది. కానీ ఇందులో సగం కూడా రావడంలేదని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఖజానా ఖాళీగా ఉంటుండడంతో రోజువారీ అవసరాలను ఎలా తీర్చాలనేది ప్రభుత్వానికి సవాలుగా మారింది.

హైదరాబాద్​లో అంతంతే..

రాష్ట్రానికి వస్తున్న స్వీయ ఆర్థిక వనరుల్లో దాదాపు 60% హైదరాబాద్ నగరం నుంచే సమకూరుతుంది. కానీ ఇప్పుడు రాజధానిలో వైరస్ తీవ్ర స్థాయిలో ఉన్నది. దుకాణాలన్నీ తెరిచే ఉన్నా ప్రజలు స్వచ్ఛందంగా లాక్‌డౌన్ విధించుకున్నారు. కొనుగోలు శక్తి పడిపోవడంతో వ్యాపార లావాదేవీలు కూడా 40% మించడం లేదంటూ వ్యాపారులు మొత్తుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి ఆదాయం సమకూరడం కూడా గగనమే. ఇటు ఆదాయం సమకూరే పరిస్థితులు లేక..అటు అప్పులు తెచ్చుకునే మార్గం లేక మున్ముందు వచ్చే ఆర్థిక కష్టాలను ప్రభుత్వం ఎలా అధిగమిస్తుందన్నది సవాల్​గా మారింది.

ఇప్పటివరకు రిజర్వు బ్యాంకు నుంచి తీసుకున్న అప్పులు

ఏప్రిల్ 13 రూ. 2,000 కోట్లు
ఏప్రిల్ 21 రూ. 2,000 కోట్లు
మే 12 రూ. 2,000 కోట్లు
మే 26 రూ. 2,000 కోట్లు
జూన్ 9 రూ. 2,500 కోట్లు
జూన్ 22 రూ. 2,000 కోట్లు

Advertisement

Next Story