కొత్త ట్రెండింగ్.. ఫార్మర్ ఫ్రెండ్లీ ‘ఈ-మండి’

by Shyam |   ( Updated:2021-10-08 21:40:10.0  )
కొత్త ట్రెండింగ్.. ఫార్మర్ ఫ్రెండ్లీ ‘ఈ-మండి’
X

దిశ, ఫీచర్స్: భారత ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయాన్ని వెన్నెముకగా అభివర్ణిస్తాం. వ్యవసాయం వల్ల దేశ తలరాత మారుతుంది కానీ అన్నదాత విధిరాత మాత్రం మారడం లేదు. రైతన్న జీవితం నిత్య కష్టాలతో, నిరంతర సమస్యలతో కొట్టామిట్టాడుతున్న విషయం తెలిసిందే. పండించిన పంటకు గిట్టుబాటు ధరలు రాక, దళారుల వల్ల మార్కెట్‌ చేసుకోలేక అప్పుల ఊబిలో చిక్కుకుపోతూ, పంటనష్టాలతో విసిగిపోతూ ‘జీవమే’ కోల్పోతున్నారు. కానీ చదువరుల రాకతో పాటు ఈ రంగంలో వస్తున్న మార్పులు వల్ల కొంత మార్పు కనిపిస్తోంది. ఈ రంగ అభివృద్ధి దేశానికి ఎంతో అవసరం కాగా ఆధునిక పరికరాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ మండిస్ ప్రవేశంతో ఇప్పటికే ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. కానీ విచారకరమైన విషయమేమిటంటే ‘ఈ-మండి’ ప్రయోజనాల గురించి రైతులకు తెలియదు. రైతుల జీవితాలను మెరుగుపరచడంలో ‘డిజిటల్ మండిస్’ ఎలాంటి గొప్ప పాత్ర పోషిస్తాయనే విషయాన్ని తెలుసుకుందాం.

వ్యవసాయాన్ని ఒక పురాతన సాంప్రదాయంలా కాకుండా కాంక్రీట్ రెవెన్యూ మోడల్‌తో వ్యాపార దృష్టితో చేస్తే రైతుల జీవితాలు తప్పకుండా మెరుగ్గా మారతాయి. అలానే వ్యవసాయం రంగం సాంకేతికతతో మద్దతు పొందినప్పుడు, లక్షలాది మంది జీవితాల్లో మార్పును తీసుకు రావచ్చన్నది అంతే వాస్తవం. అయితే లాక్‌డౌన్ టైమ్‌లో స్థానిక సాంప్రదాయ మండి వ్యవస్థల లోపాలు, వైఫల్యాలు వెలుగులోకి రాగా ఈ రకమైన వ్యవస్థను తక్షణమే పరిష్కరించే దిశగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టడంతో ఇవి డిజిటల్ లేదా ఈ-మండిస్‌గా రూపాంతరం చెందాయి. హోల్‌సేల్ వ్యాపారులు, ఇతర స్థానిక వ్యాపారులతో రైతులు నేరుగా చర్చలు జరిపేందుకు ‘ఈ-మండి’లు ఉపయోగపడతాయి. దీనివల్ల మధ్యవర్తులు(దళారులు) బెడద శాశ్వతంగా పోతుంది. డిజిటలైజ్డ్ మార్కెట్‌ప్లేస్‌లు రైతులకు కొత్త ట్రేడింగ్ అవకాశాలకు గేట్‌వేగా మారాయి.

రైతు చేతుల్లో హక్కులు..

ఈ-మండిస్ మరింత యూజర్ ఫ్రెండ్లీ ట్రేడింగ్ మాడ్యూల్‌ని ఉపయోగిస్తాయి. రైతుల తమ ఉత్పత్తుల విషయంలో పూర్తి స్వేచ్ఛతో పాటు అన్ని హక్కులను కలిగి ఉంటారు. ఇది రైతు చేతుల్లోకి తిరిగి శక్తిని అందిస్తుంది. ఒక రైతు తమ ఉత్పత్తుల వివరాలను డిజిటల్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయగానే, దేశవ్యాప్తంగా ఆసక్తిగల కొనుగోలుదారులు నేరుగా రైతులతో చర్చలు జరిపి సరుకు తీసుకోవచ్చు. B2C(బిజినెస్ టు కస్టమర్) ఫార్మాట్ రైతులను రియల్ టైమ్ ప్రైస్ పాయింట్‌లను అలాగే బేరసాల(బర్‌గెయిన్) రేట్లను వీక్షించడానికి వీలు కల్పిస్తుంది. సాఫీ చర్చలకే పరిమితం కాకుండా, సులభంగా ఆన్‌లైన్ చెల్లింపులు చేసుకునే అవకాశమిస్తోంది. దూరంలో ఉన్న ప్రాసెసర్లు, టోకు వ్యాపారులు, పెద్ద రిటైలర్లు, ఎగుమతిదారులు మొదలైన వారితో నేరుగా కనెక్ట్ అయ్యేలా రైతులకు ఇది వేదికగా ఉపయోగపడుతుంది.

బ్రేకింగ్ కాన్సెప్ట్..

డిజిటల్ మండి అనేది మార్కెట్ వ్యవస్థలో ఓ బ్రేకింగ్ కాన్సెప్ట్ కాగా ఇది వ్యవసాయ రంగ సంస్కరణలో అతి పెద్ద మార్పుగా చెప్పొచ్చు. వ్యవసాయ అమ్మకాల ప్రక్రియను మరింత పారదర్శకంగా చేయడం, రైతుల ప్రయత్నాలకు తగిన పారితోషికాన్ని అందించడం వల్ల డిజిటల్ మండిస్ పంటకోత అనంతరం నిర్వహణ పద్ధతులను ఎలా నిర్వహించవచ్చో కొత్త దృక్పథాన్ని తీసుకువచ్చింది. ఇవి రాష్ట్ర సరిహద్దులకు మించి వాణిజ్యానికి యాక్సెస్ ఇవ్వగలవు. భౌగోళిక పరిమితులు లేకపోవడంతో రైతులు తమ ఉత్పత్తులను మరింత విస్తరించవచ్చు.

మార్పు..

భారతదేశంలో ‘మండి’లా సంఖ్య పెరగాల్సి ఉండగా, మరిన్ని ప్రాంతాలకు వీటి సేవలు విస్తరించాలి. మార్జినల్ సెల్లింగ్ ప్రైస్ (MSP) వ్యవస్థ వ్యాప్తి చెందడం తక్షణ అవసరం. అయితే ఇది పూర్తి చేయాలంటే మార్కెట్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి మండి పన్నులను ఏపీఎంసీలు తిరిగి పెట్టుబడి పెట్టాలి. ఈ విషయంలో పంజాబ్ మండి బోర్డ్ అత్యుత్తమంగా వ్యవహరిస్తుంది. గ్రామీణ రహదారులు నిర్మించడానికి, వైద్య, పశువైద్యశాలలను నడపడానికి, తాగునీటిని సరఫరా చేయడానికి, పరిశుభ్రతను మెరుగుపరచడానికి, గ్రామీణ విద్యుదీకరణను విస్తరించడానికి, ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులకు ఉపశమనం అందించడానికి ఆ డబ్బులను ఉపయోగిస్తారు. అగ్రి-సెక్టార్‌ని మార్చడంలో నాణ్యత ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఎక్కువ మండిలు అవసరం లేదు. కానీ మెరుగైన క్వాలిటీ మండిలు కావాలి. వ్యాపారుల కోసం ఏకీకృత జాతీయ లైసెన్స్ ప్రవేశపెట్టడంతో పాటు మార్కెట్ ఫీజుల సింగిల్ పాయింట్ లెవీ కూడా మంచి ఆలోచన.

సాంప్రదాయ కూరగాయల మార్కెట్ స్థలాలు అనేక మంది మధ్యవర్తుల నియంత్రణలో ఉంటాయన్నది వాస్తవం. అక్కడ వాళ్లు చెప్పిందే ధర, కొన్నదే సరుకు అన్నట్లుంటుంది లెక్క. ఉనికిలో ఉన్నట్లు కనిపించే ఈ అప్రకటిత గుత్తాధిపత్యం ధరల స్వేచ్ఛా ప్రవాహాన్ని అడ్డుకోవడంతో పాటు స్థానిక రైతులకు, వారి జీవనోపాధికి కూడా అన్యాయం చేస్తుంది. అంతేకాదు స్టోరేజీలను నిల్వ చేసే ఏజెంట్లతోనూ డీలింగ్స్ పెట్టుకోవడం వల్ల రైతులపై మరింత ఒత్తిడి పెరుగుతుంది. ఈ క్రమంలో దళారులు తమ నిబంధనలనే పాటించాలని బలవంతం చేయడం మరింత దారుణమైన విషయం. ఈ మార్కెట్లు చాలా స్వయంప్రతిపత్తంగా పనిచేయడంతో పాటు పెద్దఎత్తున అవినీతి జరుగుతుంది.

వ్యవసాయ రంగం డిజిటల్ పరివర్తన అంచున ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్‌చెయిన్, మెషిన్ లెర్నింగ్, క్లైమేట్-స్మార్ట్ అడ్వైజరీ, జియో-ట్యాగింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి సాంకేతికతలను ఉపయోగించి ఆధునిక టెక్నాలజీ, డిజిటల్ మెషినరీలను ప్రవేశపెట్టడంతో, వ్యవసాయ రంగం పెట్టుబడిదారుల సంఖ్య గత కొన్ని సంవత్సరాల్లో గణనీయంగా పెరిగింది. ఇది భారతీయ వ్యవసాయ సంస్కృతి సంప్రదాయ ఆలోచనలను మార్చేందుకు ఉపయోగపడుతోంది.

Advertisement

Next Story