పాతబస్తీలో ఏమవుతున్నా పట్టించుకోరా?

by Shyam |   ( Updated:2020-06-17 09:39:38.0  )

దిశ , హైదరాబాద్: కొవిడ్ కర్ఫ్యూ నిబంధనలకు విరుద్ధంగా నగరంలో అర్ధరాత్రి హోటళ్లు నడుపుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా పాత బస్తీలోని పలు ప్రాంతాలలో టీ, బిర్యాని హోటళ్లు నడుపుతున్నారు. దీంతో హైదరాబాద్ నగర ప్రజలలో భయం మరింత పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతిరోజూ రెండు వందలకు పైగా కేసులు నమోదౌతుండగా వాటిల్లో అధిక శాతం జీహెచ్ఎంసీ పరిధిలోనివే కావడం గమనార్హం. కరోనా ఆరంభ రోజులలో వ్యాధి ప్రభావం అంతంతగా ఉన్నా.. అన్ లాక్ చేయడంతో నేడు వందల సంఖ్యలు కేసులు.. పదుల సంఖ్యలో మరణాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని నగర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా పాతబస్తీలో అర్ధరాత్రి వరకు హోటళ్లు తెరచి ఉంచితే కేసులు గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

సామాజిక దూరమేది?

హైదరాబాద్ నగరంలో కరోనా మహమ్మారి విజృంభిస్తన్నప్పటికీ ప్రజలు ఏ మాత్రం సామాజికి దూరం పాటించడం లేదు. ఎక్కడ పడితే అక్కడ గుంపులు గుంపులుగా కన్పిస్తున్నారు. చాయ్ హోటళ్ల వద్ద అవసరం లేకున్నా గంటల తరబడి గుంపులుగా నిలబడుతూ ఇతరులకు ఇబ్బందులు కల్గిస్తున్నారు. ముఖ్యంగా మటన్ దుకాణాలు, హోటళ్లలో భౌతిక దూరం ఏ మాత్రం అమలు చేయడం లేదు. ఆదివారం రోజున ఈ సమస్య మరింత జఠిలంగా మారుతోంది. అవసరం ఉన్నా లేకున్నా ప్రజలు బయటకు రావడమే కాకుండా మాస్కులు ధరించడం లేదు. ముఖ్యంగా యువత కరోనాకు ముందు తీరులోనే ద్వి చక్ర వాహనాలపై నిబంధనలకు విరుద్ధంగా ముగ్గురు ముగ్గురు దూసుకు పోతున్నారు. ఇది భాగ్యనగర వాసుల్లో ఇంకా భయాన్ని కల్గిస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం పాతబస్తీతో పాటు నగరంలోని ఇతర ప్రాంతాలలో నిబంధనలకు విరుద్ధంగా తెరిచి ఉండే హోటళ్లు, టీ స్టాళ్లు, ఇతర దుకాణాలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed