హుజూరాబాద్‌ కౌంటింగ్ ఎఫెక్ట్.. కరీంనగర్‌‌లో వాటికి ఫుల్ డిమాండ్

by Anukaran |
హుజూరాబాద్‌ కౌంటింగ్ ఎఫెక్ట్.. కరీంనగర్‌‌లో వాటికి ఫుల్ డిమాండ్
X

దిశ, కరీంనగర్ సిటీ: హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు సందడి నగరంలో మొదలైంది. ఆదివారం సాయంత్రం మొదలుతోనే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పలు పార్టీల నేతలు నగరానికి చేరుకుంటున్నారు. ఈ క్రమంలో పలు హోటళ్లు, లాడ్జీలు, ఇతర ప్రైవేట్ వసతి గృహాల ఎదుట వాహనాలు బారులు తీరాయి. ఇప్పటికే నగర శివారులోని గెస్ట్ హౌసులు, ఫంక్షన్ హాళ్లు కూడా హౌస్ ఫుల్‌గా మారాయి. కనీసం ఫ్రెష్‌అప్ అయ్యేందుకు కొద్ది గంటలపాటు రూమ్స్ ఇవ్వండంటూ, లాడ్జీలు, హోటళ్ల యజమానులను ప్రాధేయపడుతున్నారు. సారీ, అడ్వాన్స్ బుక్ అయ్యాయంటూ సున్నితంగా తిరస్కరిస్తున్నారు. దీంతో రెగ్యులర్‌గా వచ్చే కస్టమర్లు కూడా నగరంలోని లాడ్జీలు, హోటళ్లలో గదులు లభించక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఉప ఎన్నిక ఫలితాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకే..

స్టార్ హోటళ్ల నుంచి మొదలు పడక మంచాల వసతి ఉన్న లాడ్జీల్లో కూడా ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తల్లో నరాలు తెగే ఉత్కంఠ మొదలైంది. దీనిని తట్టుకోలేక టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన అనేక మంది నాయకులు, ముఖ్య కార్యకర్తలు ఉప ఎన్నిక ఫలితాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఎక్కువగానే తరలివచ్చారు. అద్దె ఎంతైనా తమకు రూములు కావాలనే ధోరణితో ఉండటంతో, యజమానులు మూడింతల అద్దె పెంచి ఓట్ల లెక్కింపు కోసం వచ్చిన వారికే ఇచ్చేందుకు ఉత్సుకత ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో వ్యాపారాల కోసం క్రమం తప్పకుండా వచ్చి, బస చేసే వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఇతరప్రాంతాల నుంచి వచ్చిన వారితో నగరంలోని మెస్‌లు, మద్యం షాపులు, బార్లు, రెస్టారెంట్లు కిక్కిరిసిపోయాయి.

Advertisement

Next Story

Most Viewed