‘అధిక బిల్లులు వసూలు చేస్తే ఆసుపత్రి అనుమతి రద్దు’

by Shyam |
‘అధిక బిల్లులు వసూలు చేస్తే ఆసుపత్రి అనుమతి రద్దు’
X

దిశ‌, అందోల్ : క‌రోనా చికిత్స నేప‌థ్యంలో ప్రైవేటు అసుప‌త్రుల‌లో ప్రభుత్వ నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా అధికంగా డ‌బ్బుల‌ను వ‌సూలు చేసిన‌ట్లయితే అసుప‌త్రి అనుమ‌తిని శాశ్వతంగా ర‌ద్దు చేస్తామ‌ని ఆర్థిక శాఖ మంత్రి హ‌రీశ్‌రావు హెచ్చరించారు. సంగారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కొవిడ్ పరిస్థితులు, మందులు, ఆక్సిజన్ అందుబాటు, ప్రైవేట్ ఆస్పత్రుల తనిఖీ, బ్లాక్ ఫంగస్ నివారణకు చర్యలు తదితర అంశాలపై శ‌నివారం వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ప్రైవేట్ ఆస్పత్రులలో ప్రభుత్వ జీవో కు విరుద్ధంగా అధిక బిల్లులు వసూలు చేస్తే అట్టి ఆసుపత్రి అనుమతిని రద్దు చేయాలని డీఎంహెచ్‌ఓ, జిల్లా కొవిడ్ ప్రత్యేకాధికారి రాజా గౌడ్ ను ఆదేశించారు. బ్లాక్ ఫంగ‌స్ పై ప్రజ‌ల్లో అవ‌గాహ‌న‌ క‌ల్పించాల‌ని, తీసుకొవ‌వాల్సిన జాగ్రత్తల‌పై వారికి తెలియ‌జేయాల‌న్నారు.

స్టెరాయిడ్స్, ఆక్సిజన్ వాడకంలో జరిగే లోటుపాట్లతో బ్లాక్ ఫంగస్ ప్రబలుతుందని, వాటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రైవేట్ ఆస్పత్రులలో అధిక బిల్లుల నియంత్రణకు ఆయా నోడల్ అధికారులు ఎప్ప‌టిక‌ప్పుడు అక‌స్మీక‌ తనిఖీలు చేప‌ట్టాల‌ని ఆయ‌న ఆదేశించారు. జిల్లాలో ఆక్సిజన్, మందులు, బెడ్స్ కు ఎలాంటి కొరత లేదని ఆయ‌న స్పష్టం చేశారు. సదాశివపేటలో త్వరితగతిన 50 పడకల ఆక్సిజన్ బెడ్స్ కొవిడ్‌ వార్డును అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఆసుపత్రులకు అవసరమైన రేమిడిసివిర్ , మందులు ఎప్పటికప్పుడు సరఫరా చేయాలన్నారు. కోవిడ్ రోగులకు సంబంధించిన వార్డులో స్టాఫ్ నర్స్ అందుబాటులో ఉండాలని, డ్యూటీ డాక్టర్లు ప్ర‌తి రోజు మూడు రౌండ్స్ చేయాలని ఆదేశించారు. డాక్టర్లకు ఎన్-95 మాస్కులు ఎప్పటికప్పుడు అందించాలని ఫార్మాసిస్ట్ కు సూచించారు. రెండవ విడుత ఇంటింటి ఫీవర్ సర్వే నాలుగు రోజుల్లోగా పూర్తి కావాలని డిఎంహెచ్‌వో గాయత్రి దేవిని ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed