ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో మనమే టాప్ : హోంమంత్రి

by Shyam |
ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో మనమే టాప్ : హోంమంత్రి
X

దిశ, న్యూస్ బ్యూరో : తెలంగాణలో అనుసరిస్తున్న పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో రాష్ట్ర పోలీస్ శాఖకు చాలా మంచి పేరు వచ్చిందని, అనేక ఇతర రాష్ట్రాలు సైతం ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయని హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. నగరంలో అమలవుతున్న లాక్‌డౌన్, కర్ఫ్యూలో భాగంగా పోలీసుల పనితీరు, ఫలితాలపై ఉన్నతాధికారులతో బుధవారం తన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి శాఖలో మౌలిక సదుపాయాల కల్పన, ఆధునీకరణ, వాహనాల కొనుగోలుతో పోలీస్ వ్యవస్థకు ముఖ్యమంత్రి అధిక ప్రాధాన్యతనిచ్చారని హోంమంత్రి చెప్పారు. లాక్‌డౌన్‌ను సమర్థవంతంగా అమలు చేయడంలో పోలీసు శాఖ గొప్ప కృషి చేస్తోందని, అన్ని వర్గాల నుంచి అభినందనలు అందుతున్నాయన్నారు. 99.9% పోలీసులు చాలా సంయమనం పాటిస్తున్నారని పేర్కొన్నారు.

రంజాన్ నెల ప్రారంభమైన నేపథ్యంలో తగిన జాగ్రతలు తీసుకోవాలని మంత్రి సూచించారు. నిబంధనల అమలులో ఓపికతో వ్యవహరించాలని, ప్రజలపై దాడులకు దిగకుండా చూసుకోవాలన్నారు. సూచనలను అమలు చేసే సిబ్బంది నిబంధనలు కచ్చితంగా పాటించేలా చూడాలని, ఎటువంటి ఫిర్యాదులు అందకుండా చూడాలని ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, డిప్యూటీ కమిషనర్లు పి. విశ్వ ప్రసాద్, కల్మేశ్వర్ సింగనేవర్, ఎ.ఆర్. శ్రీనివాస్, ఎం. రమేష్ రెడ్డి పాల్గొన్నారు.

Tags: Telangana, Lockdown, Police, Ramzan, Home Minister

Advertisement

Next Story

Most Viewed