బొమ్మలమ్మగుట్ట.. ఆదిమానవుడి గుట్టు!

by Sridhar Babu |
బొమ్మలమ్మగుట్ట.. ఆదిమానవుడి గుట్టు!
X

దిశ, కరీంనగర్: గత కాలపు చరిత్ర ఆనవాళ్లకు సజీవసాక్ష్యంగా నిలిచిన బొమ్మలమ్మగుట్ట మరో చరిత్రను తనలో దాచుకుంది. తెలుగుకు ప్రాచీనహోదా దక్కడానికి ఇక్కడి ఆధారాలే కీలకమని భావించిన అందరికీ, తాజాగా పరిశోధకుల శోధన మరోచరిత్రకు సాక్ష్యంగా నిలిపింది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని కురిక్యాల శాసనం 30 వేల ఏళ్ల నాటి చరిత్రను కలిగి ఉన్నట్లుగా భావిస్తున్నారు. ఇదే బొమ్మలగుట్టపై ఆదిమానవులకు సంబంధించిన ఆనవాళ్లు సైతం లభ్యమవడం చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తోంది.

పరిశోధకుడు రెడ్డి రత్నాకర్ అన్వేషణలో కొత్త రాతియుగం పనిముట్లు, మధ్య శిలాయుగంనాటి లోహమిశ్రమ అవశేషాలను గుర్తించారు. ఈ బొమ్మలగుట్టపై ఉన్నగుహల్లో కొత్త రాతియుగానికి చెందిన మానవులు నివసించేవారని చరిత్ర ఆధారంగా తెలుస్తోంది. కురిక్యాల శాసనం వెయ్యేళ్ల క్రితం నాటి చరిత్రతోనే కాకుండా క్రీస్తు పూర్వం 30 వేల ఏళ్ల క్రితం ఆనవాళ్లు లభ్యం అవ్వడం అంటే ఈ గుట్ట ఎంత పురాతన కాలంనాటి చరిత్ర కలిగి ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇక్కడ సూక్ష్మరాతి పనిముట్లతోపాటు కొత్తరాతి యుగానికి సంబంధించిన అనేక రాతి గొడ్డళ్లు కూడా ఉన్నాయి. 300 మీటర్ల ఎత్తున ఉన్న ఈ గుట్టను గతంలో వృషాభాద్రి, వృషభగిరి, వృషభ పర్వతమని పిలిచేవారని తెలుస్తోంది. ఇదే గుట్టపై జైన చక్రేశ్వరి అనే జైన శాసనదేవత విగ్రహం కూడా ఉంది. ఇది మనదేశంలోనే అతిపెద్ద విగ్రహమని పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాకుండా కురిక్యాల శాసనంలో తెలుగులో మూడు కంద పద్యాలు, ఆరు సంస్కృత పద్యాలు, మూడు కన్నడ పద్యాలు చెక్కబడి ఉన్నాయి. ఒకేచోట మూడు భాషలకు సంబంధించిన ఆనవాళ్లు లభ్యం కావడం కూడా అంత్యంత అరుదుగా భావిస్తున్నారు.

Tags: Karimnagar, Kurikyala, Bommalamma Gutta, History, Old status for Telugu

Advertisement

Next Story

Most Viewed