హైకోర్టులో సర్కారుకు చుక్కెదురు

by Shyam |
హైకోర్టులో సర్కారుకు చుక్కెదురు
X

దిశ, తెలంగాణ బ్యూరో : హుస్సేన్ సాగర్‌లో గణేశ్ విగ్రహాల నిమజ్జనానికి హైకోర్టు నిరాకరించింది. ఈ నెల 9వ తేదీన జారీ చేసిన తీర్పును అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. దానిలో సవరణలు చేసేలా జోక్యం చేసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ లాంటి రసాయనాలతో తయారుచేసిన విగ్రహాలను అక్కడ నిమజ్జన చేయడానికి అనుమతి ఇవ్వడమంటే కాలుష్యాన్ని సమర్ధించడమేనని, హైకోర్టు తనకు తానుగా అలాంటి పని చేయబోదని యాక్టిస్ చీఫ్ జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు, జస్టిస్ వినోద్ కుమార్‌లతో కూడిన బెంచ్ సోమవారం స్పష్టం చేసి,ది. ఈ నెల 9వ తేదీన ఇచ్చిన తీర్పులో సవరణలు చేయాలంటూ జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌పై విచారణ సందర్భంగా బెంచ్ పై వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు తీర్పుపై అభ్యంతరాలు, అసంతృప్తి ఉన్నట్లయితే సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని స్పష్టం చేసింది.

హుస్సేన్ సాగర్‌లో గణేశ్ విగ్రహాల నిమజ్జనం కారణంగా జలాలు కాలుష్యానికి గురవుతున్నాయంటూ న్యాయవాది మామిడి వేణుమాధవ్ దాఖలు చేసిన పిటిషన్‌ను గతంలో విచారించిన హైకోర్టు ఈ నెల 9వ తేదీన ఇచ్చిన తీర్పులో కొన్ని ఆంక్షలు విధించింది. టాంక్‌బండ్‌పైన, హుస్సేన్ సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ రసాయనాల విగ్రహాలను విగ్రహాల నిమజ్జనం చేయరాదని, తాత్కాలికంగా రబ్బర్ డ్యామ్‌ను నెలకొల్పాలని, ఎక్కడికక్కడ తాత్కాలిక కుంటలను ఏర్పాటుచేసి నిమజ్జనం చేసుకోవాలని… ఇలాంటి పలు ఆంక్షలను విధించింది. అయితే ఈ ఆంక్షలను ఈ ఏడాదికి మినహాయించాలని, 9వ తేదీన ఇచ్చిన తీర్పులో సవరణలు చేయాలని తాజా రివ్యూ పిటిషన్‌‌లో జీహెచ్ఎంసీ కమిషనర్ విజ్ఞప్తి చేశారు. లంచ్ మోషన్ పిటిషన్‌గా విచారణ చేపట్టిన హైకోర్టు ఎలాంటి సవరణలు చేయదల్చుకోలేదని, ఆ తీర్పులో పేర్కొన్న ఆదేశాలను అమలుచేయాల్సిందేనని వ్యాఖ్యానించింది.

వినాయక చవితి పండుగకు ఒక రోజు ముందు తీర్పు వచ్చినందున ఇప్పటికిప్పుడు తాత్కాలిక పాండ్‌లను ఏర్పాటుచేయడం సాధ్యం కాదని, వేలాది విగ్రహాల అవసరాలకు తగినట్లుగా నెలకొల్పడంలో ఆచరణాత్మక ఇబ్బందులు ఉన్నాయని, ఈ ఒక్క సంవత్సరానికి అనుమతి ఇవ్వాలని జీహెచ్ఎంసీ తరఫున హాజరైన న్యాయవాది కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు బెంచ్, ఈ పరిస్థితులన్నింటినీ ప్రభుత్వమే సృష్టించుకున్నదని, తీర్పు ఇవ్వడానికి ముందు తగినంత సమయం ఉన్నా అఫిడవిట్‌లు దాఖలు చేయలేదని, ఇబ్బందుల గురించి వివరించలేదని, తనకు తానుగా ప్రభుత్వమే ఈ పరిస్థితులకు కారణమైందని వ్యాఖ్యానించింది. నిజానికి ఈ ఇబ్బందుల గురించి ప్రభుత్వానికి నెల రోజుల ముందే తెలుసని, అయినా ఎలాంటి ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించకుండా మౌనంగా ఉండిపోయిందని వ్యాఖ్యానించింది.

తీర్పుకు ముందు జరిగిన విచారణల సందర్భంగా నీటి కుంటల్లో నిమజ్జనం వీలు కాదన్న సంగతిని ఎందుకు ప్రస్తావించలేదని హైకోర్టు బెంచ్ ప్రశ్నించింది. గతేడాది విచారణ సందర్భంగా కూడా ఇలాంటి విజ్ఞప్తులే చేశారని, ఈ సంవత్సర కాలంలో ప్రత్యామ్నాయం దిశగా ఎలాంటి చర్యలూ ఎందుకు తీసుకోలేదని గుర్తుచేసింది. హైకోర్టు తీర్పు వెలువరించిన తర్వాత మాత్రమే ప్రభుత్వానికి గుర్తుకొచ్చిందా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. చెరువుల్లోని జలాలను కలుషితం చేయవద్దన్న సంగతి, దానికోసం రూపొందించిన చట్టాల గురించి ప్రభుత్వానికి తెలియదా అని ప్రశ్నించింది. కాలుష్యం జరగకుండా కాపాడాల్సిన ప్రభుత్వమే ఇప్పుడు అనుమతి ఇవ్వాలంటూ కోరడం విడ్డూరంగా ఉన్నదని, అలాంటి చర్యలు చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుందని వ్యాఖ్యానించి హైకోర్టుకు కాలుష్యంపై స్పష్టమైన అవగాహన ఉన్నందువల్ల అనుమతి ఇచ్చి జలాలు కలుషితమయ్యేలా వ్యవహరించబోదని తేల్చి చెప్పింది.

ఈ నెల 9వ తేదీన వెలువరించిన తీర్పులో ఎలాంటి సవరణలు చేయడానికి హైకోర్టు సమ్మతించబోదని, దీనిపై అసంతృప్తి లేదా అభ్యంతరాలు ఉన్నట్లయితే సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని జీహెచ్ఎంసీకి స్పష్టం చేసింది.

====
ప్రత్యామ్నాయాలపై కేటీఆర్ సమీక్ష
హుస్సేన్ సాగర్‌లో గణేశ్ విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టు చాలా క్లారిటీతో ఉన్నందున జీహెచ్ఎంసీ తగిన ప్రత్యామ్నాయలపై దృష్టి పెట్టింది. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారు. విగ్రహాల నిమజ్జనాలకు చేయాల్సిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లతో సమీక్ష నిర్వహించారు. ఆయా జోన్లలో ఎన్ని మండపాలు, అందులోని విగ్రహాలు ఎంత సంఖ్యలో ఉన్నాయి, నిమజ్జనానికి అవసరమైన పాండ్‌ల సంఖ్య తదితరాలపై జోనల్ కమిషనర్లతో చర్చించారు. విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయడంపై ఆంక్షలు ఉన్నందువల్ల వాటికి తగిన స్థలాన్ని ఎంపిక చేసి వాహనాలను అటువైపు వెళ్ళేలా ట్రాఫిక్ మళ్ళింపు చర్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రస్తుత అవసరాలను బట్టి సుమారు పాతిక మినీ చెరువులు అవసరమవుతాయని అంచనా వేసి ఆ ఏర్పాట్లలో నిమగ్నం కావాలని జీహెచ్ఎంసీ, పోలీసు అధికారులను మంత్రి ఆదేశించారు. ఎలాగూ విగ్రహాలకు జియో టాగింగ్ చేసినందువ్ల గందరగోళానికి తావు లేకుండా చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి ఎక్కడ నిమజ్జనం చేయాలో స్పష్టత ఇవ్వాలని వివరించారు.

Advertisement

Next Story

Most Viewed