జూలై 5 నుంచి ఎంసెట్

by Shyam |
eamcet students
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ఎంసెట్ జూలై 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జరిగేలా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి షెడ్యూలు ఖరారు చేసింది. ఇప్పటికే వార్షిక పరీక్షల షెడ్యూలు ఖరారు కావడంతో ప్రవేశ పరీక్షలపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఎంసెట్‌తో పాటు ఈసెట్, లాసెట్, పీజీ లాసెట్, ఐసెట్, పీజీ ఈసెట్, ఎడ్‌సెట్, పీఈసెట్ లపై కూడా మండలి చైర్మన్ వివిధ వర్సిటీల ప్రతినిధులతో చర్చించారు. దీనిలో భాగంగా ఎంసెట్ ను జూలై 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నిర్వహించేలా షెడ్యూలు ఖరారు చేశారు. జేఎన్‌టీయూ (హైదరాబాద్) ఎంసెట్ పరీక్షను నిర్వహిస్తుందని, కన్వీనర్‌గా ఆ వర్సిటీ రెక్టార్ ప్రొఫెసర్ గోవర్ధన్ వ్యవహరిస్తారని ఒక ప్రకటనలో తెలిపారు. బీఈ, బీటెక్, బీఫామ్, ఫార్మా-డీ కోర్సుల్లో చేరాలనుకునేవారు ఈ ప్రవేశ పరీక్షను రాయాల్సి ఉంటుంది.

బీఈ, బీటెక్, బీఫామ్ తదితర కోర్సుల్లో లేటెరల్ ఎంట్రీగా చేరాలనుకునే (డిప్లొమా పూర్తిచేసినవారు నేరుగా ఇంజనీరింగ్ కోర్సు రెండో సంవత్సరంలో చేరేలా)వారు రాసే ఈసెట్ పరీక్షను జూలై 1వ తేదీన నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యా మండలి ఒక ప్రకటనలో తెలిపింది. జేఎన్‌టీయూ (హైదరాబాద్) అడ్మిషన్ల విభాగం డైరెక్టర్ ప్రొఫెసర్ వెంకటరమణారెడ్డి ఈ పరీక్షకు కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. ఎంఈ, ఎంటెక్, ఎంఆర్క్, ఎంఫామ్ తదితర పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో చేరేవారికి నిర్వహించే పీజీఈసెట్ జూన్ 20 నుంచి నిర్వహించనున్నట్లు తెలిపింది. లాసెట్ (గ్రాడ్యుయేషన్), పీజీ లాసెట్, ఎడ్‌సెట్, ఐసెట్, పీఈసెట్ పరీక్షల షెడ్యూలు ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. రాష్ట్రంలో మొత్తం వివిధ కోర్సుల్లో ప్రవేశానికి రాష్ట్ర ప్రభుత్వం పలు రకాల ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తోంది. ఏడు ప్రవేశ పరీక్షలపై చర్చించి ప్రస్తుతానికి మూడు పరీక్షలకు తేదీలను ఖరారు చేసింది.

Advertisement

Next Story