ఫ్లాష్ ఫ్లాష్ : ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం.. శ్మశానవాటిక జోలికి వెళ్లొద్దు

by Shyam |
ఫ్లాష్ ఫ్లాష్ : ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం.. శ్మశానవాటిక జోలికి వెళ్లొద్దు
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్(టీఎస్ఐఐసీ)కి షాక్ తగిలింది. తాజాగా చేపట్టిన భూముల వేలం పాట వివాదాస్పదమైంది. రాష్ట్రంలో అత్యంత ఖరీదైన భూములను ఈ ఆక్షన్ ద్వారా ప్రముఖ కంపెనీలకు కట్టబెట్టిన విషయం తెలిసిందే. ఐతే ఆ భూమి శ్మశానవాటికదని, అందులో సమాధులు ఉన్నాయంటూ స్థానికులు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు కూడా యథాతథ స్థితిని కొనసాగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ సర్వే నం.41/14లోని 15 ఎకరాల ప్రభుత్వ భూమిని ఐదు ప్లాట్లుగా చేసి శుక్రవారం వేలం వేశారు. ప్రముఖ కంపెనీలు దక్కించుకున్నాయి. ఐతే టీఎస్ఐఐసీ ఏర్పాటు చేసిన ప్లాట్ నం.7లోని రెండెకరాలపై పేచీ పడింది.

ఇందులో శ్మశానవాటిక ఉందని, సమాధులు కూడా ఉన్నాయని స్థానికులు వాదిస్తున్నారు. అంత వరకు డీమార్కేషన్ చేసి మిగతా స్థలాన్ని వేలం వేయాలన్న తమ డిమాండ్‌ను అధికారులు పట్టించుకోలేదని స్థానిక బీజేపీ నాయకుడు గంగాల రాధాకృష్ణ శనివారం ‘దిశ’కు వివరించారు. 2011 నుంచి తాము అధికారులకు మొర పెట్టుకుంటున్నట్లు చెప్పారు. ఐతే శుక్రవారం తామందరినీ గృహ నిర్బంధం చేసి వేలం పాటను పూర్తి చేశారని ఆరోపించారు. ఐతే హైకోర్టు శుక్రవారం సాయంత్రం స్టేటస్ కో ఇచ్చినట్లు తెలిపారు. తదుపరి విచారణను వచ్చే నెల 5వ తేదీకి వాయిదా వేశారు.ఈ వివాదాస్పద ప్లాటును ఈ వేలంలో లింక్ వెల్ టెలీసిస్టమ్స్ ప్రైవేటు లిమిటెడ్ అనే సంస్థ ఎకరం రూ.46.20 కోట్లు పెట్టి 2 ఎకరాలను రూ.92.40 కోట్లకు దక్కించుకున్నది. మిగతా ప్లాట్లు నం.4, 6, 12, 14 లపై ఎలాంటి వివాదాలు లేవు.

Advertisement

Next Story