రైతులకు పరిహారం చెల్లించండి.. హైకోర్టు ఆదేశం

by Shyam |
రైతులకు పరిహారం చెల్లించండి.. హైకోర్టు ఆదేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: గతేడాది సెప్టెంబర్, అక్టోబరు నెలల్లో కురిసిన వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులందరికీ ఇన్‌పుట్ సబ్సిడీని చెల్లించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పంటల బీమా పథకాన్ని అమలు చేయని కారణంగా వారికి తగినంత సాయాన్ని కూడా ఇవ్వాలని స్పష్టం చేసింది. నష్టపోయిన రైతుల వివరాలను మూడు నెలల వ్యవధిలో సేకరించాలని, ఆ తర్వాత నెల రోజుల్లో పరిహారం అందించాలని ఆదేశించింది. కౌలు రైతులకు సైతం పరిహారం ఇవ్వాల్సిందేనని, పంటల బీమా లెక్క కింద ఇచ్చేది అదనంగా ఉండాలని స్పష్టం చేసింది. గతేడాది వానాకాలంలో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోకపోవడంతో రైతు స్వరాజ్య వేదిక దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం విచారించిన హైకోర్టు.. పై ఆదేశాలు జారీ చేసింది.

ప్రకృతి వైపరీత్యాల కారణంగా ప్రతీ ఏటా రైతులు నష్టపోతున్నారని, బాధిత రైతుల వివరాలను ప్రభుత్వం సేకరించడమే లేదని, వ్యవసాయశాఖ నుంచి జీవోలు లేనందువల్లనే జిల్లా స్థాయిలో ప్రభుత్వ సిబ్బంది ఈ ప్రక్రియ చేపట్టడంలేదని వేదిక తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గతేడాది వానాకాలం నుంచి పంటల బీమా పథకాలు రాష్ట్రంలో అమల్లో లేవని పేర్కొన్నారు. భారీ వర్షాలు, వడగండ్లు, తుపాను, వరదలు లాంటి పరిస్థితులతో రైతులు పంటలను నష్టపోతున్నారని, దిగుబడి తగ్గిపోవడంతో పాటు ప్రభుత్వం నుంచి సాయం అందడంలేదని, చివరకు అప్పుల్లో కూరుకుపోతున్నారని పేర్కొన్నారు. కొద్దిమంది రైతులు ఆత్మహత్య కూడా చేసుకుంటున్నారని గుర్తుచేశారు.

ప్రభుత్వం మాత్రం రైతుబంధు ఇస్తున్నామని, రైతులకు గతేడాది వానాకాలంలో నష్టమే జరగలేదని కోర్టుకు చెప్పడాన్ని న్యాయవాది ఉదహరించారు. కానీ వర్షాల కారణంగా రైతులు నష్టపోయారంటూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసి, ఆర్థికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేసిందని, కేంద్ర ప్రభుత్వం ఆ లేఖ ప్రతిని, రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసిన నష్టాన్ని నివేదిక రూపంలో కోర్టుకు సమర్పించిందని గుర్తుచేశారు. హైకోర్టు తీర్పును రైతు స్వరాజ్య వేదిక ఆహ్వానించింది. ఈ ఉత్తర్వులు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని, ఇప్పటికైనా దీని అమలుకు పూనుకోవాలని వేదిక ప్రతినిధులు కిరణ్ కుమార్, కన్నెగంట రవి, ఆశాలత పేర్కొన్నారు.

Advertisement

Next Story