కరోనా కట్టడిలో ప్రభుత్వానికి శ్రద్ధ లేదు: హైకోర్టు

by Anukaran |   ( Updated:2020-07-15 11:31:54.0  )
కరోనా కట్టడిలో ప్రభుత్వానికి శ్రద్ధ లేదు: హైకోర్టు
X

దిశ, న్యూస్‌బ్యూరో: ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా టెస్టులు కోసం ముందుకొచ్చేవారందరికీ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వానికి శ్రద్ధ లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రధాన న్యాయమూర్తితో కూడిన డివిజన్ బెంచ్ గతంలో చీఫ్ జస్టిస్ చెప్పిన సూచనలను కూడా పాటించడంలేదని వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో ఎక్కడెక్కడ కరోనా పరీక్షలు చేస్తున్నారో ప్రజలకు తెలియడం లేదని, కరోనా సోకినవారికి ప్రభుత్వం ఎలాంటి చికిత్స అందిస్తుందో కూడా అర్థం కావడంలేదని పేర్కొంది. కరోనా కట్టడిపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా బుధవారం డివిజన్ బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది.

హైకోర్టు లేవనెత్తిన అంశాలకు స్పందించిన ప్రభుత్వం తరఫు న్యాయవాది సీరియస్ కండిషన్ ఉన్న పేషెంట్లకు కింగ్ కోఠి, గాంధీ, చెస్ట్ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నామని తెలిపారు. లక్షణాలు తక్కువగా ఉన్న పేషెంట్లకు సరోజినిదేవి కంటి ఆసుపత్రి, ఎర్రగడ్డలోని ఆయుర్వేద ఆసుపత్రి, బేగంపేటలోని నేచర్‌క్యూర్‌ ఆస్పత్రులలో చికిత్స అందిస్తున్నామని తెలిపారు. జోక్యం చేసుకున్న డివిజన్ బెంచ్ ఈ వివరాలన్నింటినీ ప్రసార మాధ్యమాల్లో ప్రచారం చేసి ప్రజలకు తెలియజేసేలా చొరవ తీసుకోవాలని సూచించింది. సామాన్య ప్రజానీకం ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టడంలేదని వ్యాఖ్యానించింది.

Advertisement

Next Story

Most Viewed