లాఠీలతో వైరస్‌నూ తనిఖీ చేస్తారా – హైకోర్టు

by Shyam |
లాఠీలతో వైరస్‌నూ తనిఖీ చేస్తారా – హైకోర్టు
X

దిశ, న్యూస్‌బ్యూరో: ఒక వ్యక్తిలో వైరస్ ఉందో లేదో కనుక్కోడానికి లాఠీని కూడా వాడతారా అని నగర పోలీసుల్ని రాష్ట్ర హైకోర్టు ప్రశ్నించింది. బైక్‌లపై వెళ్ళేవారికి వైరస్ ఉందో లేదో లాఠీల ద్వారా కనిపెట్టినట్లు నగర పోలీసు కమిషనర్ సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొనడంపై విస్మయం వ్యక్తం చేసింది. నగరానికి చెందిన షీలా సారా మాథ్యూస్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి విజయసేన్ రెడ్డిలతో కూడిన డివిజన్ బెంచ్ గురువారం విచారించి నగర పోలీసు కమిషనర్ సమర్పించిన అఫిడవిట్ సమగ్రంగా లేదని, నిర్దిష్టంగా పిటిషనర్ లేవనెత్తిన సంఘటనలకు సంబంధించిన వివరాలు లేవని, వీటిని వివరించడంతో పాటు సంబంధిత డాక్యుమెంట్లను, రిపోర్టులను కూడా ఈనెల 29వరకు సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను 30వ తేదీకి వాయిదా వేసింది.

బైక్‌లపై ప్రయాణిస్తున్న వ్యక్తులు పోలీసుల్ని చూసి వారంతట వారే పారిపోయే ప్రయత్నం చేశారని, ఆ క్రమంలో గాయాలపాలయ్యారని పోలీసు కమిషనర్ ఆ అఫిడవిట్‌లో పేర్కొనడాన్ని బెంచ్ ప్రస్తావించింది. పోలీసులు ఉద్దేశపూర్వకంగా లాఠీలకు పనిచెప్పడం ద్వారా దెబ్బలు తగలడం, పోలీసులే వారిని ఆసుపత్రులకు తీసుకెళ్ళడం లాంటి సంఘటనల అనంతరం సంబంధిత పోలీసులకు తీసుకున్న శాఖాపరమైన చర్యలేంటని పోలీసుశాఖ తరఫున హాజరైన న్యాయవాదిని ప్రశ్నించింది. గాయాలపాలైనవారికి సంబంధించిన మెడికల్ సర్టిఫికెట్లను అఫిడవిట్‌తో పాటు పొందుపర్చకపోవడాన్ని తప్పుపట్టింది. వికలాంగుడు తరచూ ట్రాఫిక్ నిబంధనలను, మోటారు వాహన చట్టాన్ని ఉల్లంఘించాడంటూ పోలీసులు ప్రస్తావించిన అంశాన్ని బెంచ్ అందుకు సంబంధించిన చలాన్‌లను ఎందుకు జతపర్చలేదని ప్రశ్నించింది.

నిత్యావసర వస్తువుల కోసం బైక్‌పై దుకాణానికి వెళ్తున్న ఇద్దరిని పోలీసులు నిలువరించి లాఠీలతో కొట్టడం ద్వారా కంటికి గాయమైందని, 35కుట్లు వేయాల్సి వచ్చిందని, పోలీసులు ఎందుకు ఇంత క్రూరంగా వ్యవహరించాల్సి వచ్చిందని బెంచ్ ప్రశ్నించింది. సదరు పోలీసు సిబ్బందిపై తీసుకున్న శాఖాపరమైన చర్యల వివరాలను కోరింది. హెల్మెట్ లేకుండా, ముఖానికి మాస్కు లేకుండా రోడ్డుమీదకు వస్తే ఇలా వ్యవహరిస్తారా అని ప్రశ్నించింది. దీనికి న్యాయవాది స్పందిస్తూ, యాధృచ్చికంగా లాఠీ తగిలిందని, కళ్ళజోడు పగిలి కంటి కింద గాయమైందని ఆ సంఘటనను సమర్ధించుకున్నారు. ఒక యాధృచ్ఛికమైన దెబ్బకు 35 కుట్లు పడడంతో పాటు లోపలి ఎముక కూడా విరిగిపోతుందా అని బెంచ్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇలాంటి అనేక సంఘటనలను ఎత్తిచూపిన డివిజన్ బెంచ్ వాటన్నింటికి సంబంధించిన గాయాలు, డాక్టర్ల సర్టిఫికెట్లు, గాయాలపాలైన వ్యక్తుల వివరాలు, సదరు వ్యక్తులు ఇచ్చిన వాంగ్మూలం తదితరాలన్నింటినీ తదుపరి విచారణ సమయానికి అఫిడవిట్‌తో పాటు సమర్పించాలని ఆదేశించింది.

Advertisement

Next Story

Most Viewed