పాలమూరులో ఇంటింటి సర్వే

by vinod kumar |
పాలమూరులో ఇంటింటి సర్వే
X

దిశ, మహబూబ్‌నగర్: భారత్ సహా ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ (కొవిడ్ -19) కట్టడికి జిల్లాలో అటు అధికార యంత్రాంగం, ఇటు ప్రజా ప్రతినిధులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. అనుమానం ఉన్న ప్రతి ఒక్కరినీ అధికారులు క్వారంటైన్లకు తరలిస్తున్నారు. ఇంటింటి సర్వే చేస్తూ ఇంకా బాధితులు ఎవరైనా ఉన్నారా అనే విషయాలను సేకరిస్తున్నారు. అయితే, ఢిల్లీ మార్కజ్ ఘటన జిల్లాను కరోనా కోరల్లోకి నెట్టింది. జిల్లాలో వారం రోజుల కిందటి వరకు కేవలం 2 కేసులు మాత్రమే ఉండగా వారం తిరిగే సరికి ఏకంగా 20 కేసులు నమోదయ్యాయి. ఈ విషయం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. జోగులాంబ గద్వాల జిల్లాను ఇప్పటికే హాట్ స్పాట్‌గా ప్రభుత్వం గుర్తించింది. తాజాగా ఆ జిల్లాకు చెందిన అయిజ మండలంలో మరో 4 కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఇప్పటి వరకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో..మహబూబ్‌నగర్‌లో 7 కేసులు, నాగర్ కర్నూలు జిల్లా‌లో 2 కేసులు నమోదు కాగా మిగిలిన 11 కేసులు జోగులాంబ గద్వాలలో నమోదయ్యాయి. వనపర్తి, నారాయణపేట జిల్లాలో ఎలాంటి కేసులు నమోదు కాలేదు. గద్వాలకు సంబంధించి ఎక్కువ కేసులు నమోదయినా అవి మర్కజ్ తోనే ముడిపడినవని అధికారులు చెబుతున్నారు. అయిజ పట్టణం నుంచి మొత్తం 20 మంది మర్కజ్‌కు వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. వారిలో ఇంకా కొంతమంది నమూనాలకు సంబంధించిన రిపోర్టులు రాలేదు. వాటిలో ఇంకా ఏమైనా కేసులు నమోదు అవుతాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఉమ్మడి జిల్లాకు సంబంధించి మొత్తం 354 నమూనాలు సేకరించగా 20 కేసులు పాజిటివ్ రాగా 107 మందికి నెగటివ్ వచ్చింది. అలాగే 227 మందికి సంబంధించిన రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. మహబూబ్‌నగర్‌కు చెందిన ఒకరు ట్రీట్‌మెంట్ అనంతరం డిశ్చార్జ్ అవగా, గద్వాలకు చెందిన ఒకరు కరోనాతో మరణించారు.

Tags: covid 19 cases, high alert, dist officers, every house survey

Advertisement

Next Story

Most Viewed