వర్ష బీభత్సం.. గర్భిణీ పాట్లు

by Shyam |   ( Updated:2020-09-26 03:23:16.0  )
వర్ష బీభత్సం.. గర్భిణీ పాట్లు
X

దిశ, తాండూరు: వికారాబాద్ జిల్లాలో రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో తాండూరు నియోజకవర్గంలోని పెద్దేముల్, బషీరాబాద్, యాలాల మండలాల్లో వాగులు, వంకలు పొంగి పొరుతున్నాయి. పంటపొలాల్లోకి భారీగా వర్షం నీరు వచ్చి పంట పొలాలు దెబ్బతిన్నాయి. అయితే భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తాండూరు ప్రాంతం నుంచి ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. కాగ్నా నది ఉధృతంగా పారుతుండటంతో తాండూరు-మహబూబ్‌నగర్ రాకపోకలు నిలిచిపోయాయి. ఇటు పెద్దేముల్ మండలంలోని మాంబాపూర్ మీదుగా వెళ్లే దారిలో మన్సాన్పల్లి వాగు కొట్టుకుపోవడంతో హైదరాబాద్ నగరానికి రాకపోకలు నిలిచిపోయాయి. అటు నాగసముందర్ వాగు సైతం కొట్టుకుపోయింది. దీంతో వికారాబాద్ జిల్లా కేంద్రానికి రాకపోకలు బంద్ అయ్యాయి.

ఇదిలావుంటే వికారాబాద్ జిల్లాలోనే అత్యధికంగా బషీరాబాద్ మండలంలో 168.0 మీ.మీ వర్షపాతం నమోదైంది. నిండు గర్భిణీ ప్రసవం కోసం పడరాని పాట్లు పడింది. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని జీవన్గీ గ్రామానికి చెందిన లాల్ బీ అనే ఓ నిండు గర్భిణీకి పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో గర్భిణీని బషీరాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించేందుకు బయల్దేరారు. మార్గం మధ్యలో వాగు ఉండటంతో స్థానికులు గర్భిణీని స్ట్రేచర్ పై పడుకోబెట్టి వాగు దాటించి, 108లో ఆసుపత్రికి తరలించారు. అయితే వాగులు, బ్రిడ్జిల మరమ్మతులు చేయకపోవడంతో అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story