గౌరవెల్లి చెరువుకు గండి.. భయంతో జనాలు

by Shyam |
Gauravelli pond
X

దిశ, హుస్నాబాద్: గత కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చెరువులన్నీ నిండు కుండలను తలపిస్తున్నాయి. ఈ క్రమంలోనే సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి గ్రామంలోని చెరువు కట్ట ప్రమాదకరంగా మారిందని, గండిపడే అవకాశం ఉందని గ్రామస్తులు, రైతులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. విషయం తెలిసిన వెంటనే చెరువును పరిశీలించిన గ్రామ పాలకవర్గం సభ్యులు వీరాచారి మాట్లాడుతూ.. గత నాలుగేళ్ల క్రితమే మిషన్ కాకతీయ పనుల్లో భాగంగా సుమారు రూ.80లక్షలతో చెరువుకు మరమ్మత్తులు చేపట్టామని తెలిపారు. అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై, కమీషన్లకు కక్కుర్తిపడి నాసిరకమైన పనులు చేశారని ఆరోపించారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కుందన్ వానిపల్లి, రామవరం, గుడాటిపల్లి, గిరిజన తండాలతో పాటు పలు గ్రామాల నుంచి వరదనీరు వచ్చి గౌరవెల్లి చెరువు మత్తడి దూకి ఉధృతంగా ప్రవహిస్తోందని అన్నారు. గతంలో చెరువు మత్తడి పోడవు పెద్దదిగా ఉండేదని, మరమ్మత్తుల్లో భాగంగా వెడల్పు తగ్గించారని తెలిపారు. ఈ చెరువుపై అధికారులు దృష్టి సారించకపోతే వందల ఎకరాల్లో పంటనష్టం జరిగే అవకాశం ఉందని సూచించారు. వెంటనే స్థానిక ఎమ్మెల్యే, ఆర్డీవో స్పందించి చెరువు కట్టకు గండి పడకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని రైతులు, గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed