కిరాయిదారులకు అండగా బల్దియా.. కడచూపునకు ప్రత్యేక స్థలం

by Shyam |
కిరాయిదారులకు అండగా బల్దియా.. కడచూపునకు ప్రత్యేక స్థలం
X

దిశ‌, వ‌రంగ‌ల్ తూర్పు: న‌గ‌రంలో నివాస‌ముంటున్న కిరాయిదారుల‌కు అండ‌గా నిలిచేందుకు వ‌రంగ‌ల్ మ‌హా న‌గ‌ర‌పాల‌క సంస్థ ముందుకొచ్చింది. చివ‌రి చూపుకోసం వ‌చ్చే బంధువుల‌కు ఆశ్ర‌యం క‌ల్పించేలా ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తోంది. ప‌ట్ట‌ణ ప‌రిధిలోని ప్ర‌భుత్వ స్థ‌లంలో ఇందుకు కావాల్సిన ఏర్పాట్ల‌ను ప‌రిశీలించి స‌మ‌గ్ర డీపీఆర్ రూపొందించేందుకు అధికారులు క‌స‌ర‌త్తు మొద‌లుపెట్టారు.

2.53ల‌క్ష‌ల ఇండ్లు..

వ‌రంగ‌ల్ మ‌హా న‌గ‌ర‌పాల‌క సంస్థ ప‌రిధిలో సుమారు 2.53ల‌క్ష‌ల ఇండ్లున్నాయి. ఒక్కో ఇంటిలో గృహ య‌జ‌మానుల‌తో పాటు ఇద్ద‌రు ముగ్గురు కిరాయి దారుల కుటుంబాలు కూడా నివాస‌ముంటున్నాయి. ఈ లెక్క‌న న‌గ‌ర ప‌రిధిలో క‌నీసం ఐదు ల‌క్ష‌ల పైచిలుకు కుటుంబాలు నివాసముంటున్నాయి. వీరికి తోడు క‌రువు స‌మ‌యంలో వేస‌వి కాలంలో ప‌ల్లెల‌ నుంచి ప‌ట్ట‌ణాల‌కు వ‌ల‌స వ‌చ్చి జీవ‌నం సాగిస్తున్న వారి సంఖ్య‌ కూడా అధికంగా ఉంటుంది.

కిరాయిదారులు చనిపోతే..

న‌గ‌రంలో సొంత ఇళ్లు లేక కిరాయికి ఉంటున్న వారి కుటుంబంలో ఎవ‌రైనా చ‌నిపోతే వారి బాధ‌లు వ‌ర్ణ‌ణాతీతంగా మారుతున్నాయి. మృతదేహాన్ని ఇంటికి తీసుకు వ‌చ్చేందుకు స‌ద‌రు ఇంటి య‌జ‌మాని నిరాక‌రించ‌డంతో ఏమి చేయాలో తెలియ‌ని ఆయోమ‌య ప‌రిస్థితిలో ఆ కుటుంబం రోడ్డుపాల‌వుతోంది. దూరం నుంచి బందువులు రావాల్సి ఉన్నా త‌ప్ప‌ని ప‌రిస్థితిలో ఆ మృత‌దేహాన్ని నేరుగా శ్మ‌శాన వాటిక‌కు త‌ర‌లించాల్సిన ప‌రిస్థితి నెల‌కొంటుంది. దీంతో చాలా మందికి త‌మ బందువు క‌డ‌సారి చూపు ద‌క్క‌డ‌మే లేదు. మ‌రి కొంద‌రు శ్మ‌శాన వాటిక‌కు స‌మీపంలోనే టెంట్ వేసుకొని బంధువులు వ‌చ్చే వ‌ర‌కు వేచి చూస్తున్నారు.

క‌ర్మ‌కాండ‌లోనూ క‌ష్టాలే..

క‌ర్మ‌కాండ పూర్త‌యి 11రోజుల‌కు పుణ్య‌హ‌వ‌చ‌నం చేసేవ‌ర‌కు గృహ య‌జ‌మానులు కిరాయిదారుల‌ను ఇంటికి రానివ్వ‌డంలేదు. మ‌రికొంద‌రైతే ఎవ‌రైనా మృతి చెందిన వెంట‌నే ఇంటిని ఖాళీ చేయాల్సిందిగా ఆదేశిస్తున్నారు. దీంతో శ్మ‌శాన వాటిక‌వ‌ద్దే ఈ తంతుల‌న్నీ పూర్తి చేస్తున్నారు.

అండ‌గా నిలిచేందుకే…

ఇలాంటి వారికి బ‌ల్దియా అండ‌గా నిలువాల‌ని నిర్ణ‌యించింది. ఈ మేర‌కు న‌గ‌రంలోని ప్ర‌భుత్వ స్థలాన్ని గుర్తించే ప‌నిలో అధికారులు ఉన్నారు. ఎంత స్థ‌లం కావాలి..అందులో క‌ల్పించాల్పిన వ‌స‌తులు ఎలా ఉండాలి..ఎంత మందికి స‌రిపోయేలా వీటిని ఏర్పాటు చేయాలి..దీనికి ఎంత ఖ‌ర్చు వ‌స్తుంది త‌దిత‌ర అంశాల‌తో డీపీఆర్ త‌యారు చేయాల్సిందిగా మేయ‌ర్ గుండా ప్ర‌కాశ్‌రావు ఇంజ‌నీరింగ్ అధికారుల‌ను ఆదేశించారు. వారినుంచి స‌మ‌గ్ర స‌మాచారం రాగానే నిధులు కేటాయించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది అమ‌లులోకి వ‌స్తే కిరాయిదారుల‌కు ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంద‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed