టీఆర్ఎస్ నేతల ఒత్తిడి.. పారిపోతున్న అధికారులు

by Anukaran |   ( Updated:2021-03-20 08:16:55.0  )
టీఆర్ఎస్ నేతల ఒత్తిడి.. పారిపోతున్న అధికారులు
X

దిశ ప్ర‌తినిధి, వ‌రంగ‌ల్ : ఓరుగ‌ల్లు రాజ‌కీయ చద‌రంగంలో జీడ‌బ్ల్యూఎంసీ అధికారులు పావులుగా మారుతున్నారా? అధికార పార్టీ ప్ర‌జాప్ర‌తినిధుల చేతిలో కీలుబొమ్మ‌లుగా మారి నింద‌లు మోయాల్సి వ‌స్తోందా? త‌ప్ప‌ని అధికార దుర్వినియోగం జ‌రుగుతోంద‌ని తెలిసి కూడా త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో స‌హ‌క‌రిస్తున్నామ‌ని మ‌నస్తాపానికి లోన‌వుతున్నారా? అంటే సంబంధిత అధికార వర్గాల నుంచి అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. త‌మ ప‌రిస్థితి ‘ముందు నుయ్యి.. వెనుక గొయ్యి’లా త‌యారైంద‌ని ఆవేద‌న చెందుతున్నారు. నోరు తెరిచి బ‌య‌ట‌కు ఏం స‌మాధానాలు చెప్ప‌లేక ఏకంగా మూకుమ్మ‌డి సెల‌వులు పెట్టాల‌నే నిర్ణ‌యానికి కొంత‌మంది అధికారులు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది.

మొదటి నుంచీ ఒత్తిళ్లే!

జీడ‌బ్ల్యూఎంసీ వార్డుల పున‌ర్విభ‌జ‌న మొద‌లైన నాటి నుంచి సంబంధిత ప్ర‌క్రియ‌లో భాగంగా ప‌నిచేస్తున్న అధికారుల‌పై తీవ్ర ఒత్తిడి ఉన్నట్లు తెలుస్తోంది. అంతా ప‌ద్ధ‌తి ప్ర‌కారం జ‌ర‌గాల్సిందేన‌ని ముందు మార్గ‌ద‌ర్శ‌నం చేసిన‌ ఉన్న‌తాధికారులు అత్యున్న‌త స్థాయి పొలిటిక‌ల్ లీడ‌ర్ల‌ ఎంట్రీతో చివ‌రికి వారే మ‌ళ్లీ మార్పులు చేయాలంటూ హైద‌రాబాద్‌కు జీడ‌బ్ల్యూఎంసీ అధికారుల‌ను పిలిచి మ‌రీ చెప్పిన‌ట్లు స‌మాచారం. ప్ర‌భుత్వంలో ఎంతో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించే ఒక మంత్రి నుంచి జీడ‌బ్ల్యూఎంసీ డివిజ‌న్ల పున‌ర్విభ‌జ‌నలో ఇద్ద‌రు ఓరుగ‌ల్లు ప్ర‌జాప్ర‌తినిధుల సూచ‌న‌ల‌కు అనుగుణంగా మార్పులు చేయాలంటూ మున్సిపల్ శాఖ ఉన్న‌తాధికారుల‌కు ఆదేశాలు అందిన‌ట్లు చ‌ర్చ జ‌రుగుతోంది.

ఓ నేత అయితే ముసాయిదా కాపీని తెప్పించుకుని మ‌రీ త‌న‌కు న‌చ్చిన‌ట్లుగా మార్చాల‌ని అధికారుల‌ను ఆదేశించిన‌ట్లుగా తెలుస్తోంది. మ‌రికొద్ది గంట‌ల్లో ముసాయిదా విడుద‌ల‌వుతుంద‌ని అంతా భావిస్తున్న త‌రుణంలో అర్ధంత‌రంగా ఆగిపోయి రీ షెడ్యూల్‌లో జారీ చేయ‌బ‌డి ఆ ఇద్ద‌రు ప్ర‌జాప్ర‌తినిధులు చెప్పిన‌ట్లుగా మార్పులు చేసిన ముసాయిదానే విడుద‌లైంద‌న్న ఆరోప‌ణ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ‘నిబంధ‌న‌లు అంటారు.. అధికారం అంటారు.. చేయ‌మంటారు.. అప్పుడే వ‌ద్దంటారు.. అస‌లు ఏం చేస్తున్నామో!? ఎలా చేస్తున్నామో!? ఎందుకు చేస్తున్నామో!? తెలియ‌డం లేదు. మొత్తంగా మెంట‌ల్ ఎక్కిపోతోంది’అంటూ వేర్వేరుగా ముగ్గురు అధికారులు దిశతో ఇదే తరహాలో వ్యాఖ్యానించడం చూస్తూంటే వారిపై ఎలాంటి రాజ‌కీయ ఒత్తిళ్లు ప‌నిచేస్తున్నాయో అర్థం చేసుకోవ‌చ్చు. రాజ‌కీయ ఒత్తిళ్ల‌తో చివ‌రికి దోషులుగా నిల‌బ‌డాల్సి వ‌స్తోంద‌ని కింది స్థాయి సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మూకుమ్మ‌డిగా సెల‌వులు?

డివిజ‌న్ల పునర్విభ‌జ‌న ప్ర‌క్రియ‌లో రాజకీయ ఒత్తిళ్లతో అధికారులు, సిబ్బంది వ్యక్తిగత, ఆరోగ్య కారణాలను చూపుతూ కొద్దిరోజుల పాటు సెల‌వులో ఉండాల‌ని యోచిస్తున్న‌ట్లు జీడ‌బ్ల్యూఎంసీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ డివిజ‌న్ల పున‌ర్విభ‌జ‌న ప్ర‌క్రియ త‌మ మెడ‌కేడ చుట్టుకుంటోంద‌న‌న్న టెన్ష‌న్ కొంత‌మంది అధికారుల్లో వ్య‌క్త‌మ‌వుతుండ‌టం గ‌మ‌నార్హం.

అశాస్త్రీయంగా పున‌ర్విభ‌జ‌న‌?

జీడ‌బ్ల్యూఎంసీ అధికారులు విడుద‌ల చేసిన ముసాయిదాపై తీవ్ర‌స్థాయిలో విప‌క్షాల నుంచి విమర్శ‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు అధికార పార్టీకి చెందిన తాజా మాజీ కార్పొరేట‌ర్లు కూడా పున‌ర్విభ‌జ‌న శాస్త్రీయంగా లేద‌ని ఫిర్యాదులు చేశారు. ముసాయిదాలో చాలా డివిజ‌న్ల‌కు సంబంధించిన ఓట‌ర్ల వివ‌రాలు, ఇంటి నెంబ‌ర్లు, స‌రిహ‌ద్దులు పేర్కొన‌క‌పోవ‌డంతో గంద‌ర‌గోళం నెల‌కొంది. ఈ క్రమంలో శుక్ర‌వారం రాత్రి 11గంట‌ల స‌మ‌యంలో మార్పులు చేసిన అద‌న‌పు ముసాయిదాను విడుద‌ల చేయ‌డం గ‌మ‌నార్హం. పున‌ర్విభ‌జ‌న ప్ర‌క్రియ‌లో శాస్త్రీయ‌త లోపించింద‌ని విప‌క్షాల నాయ‌కులు ఆరోపిస్తున్నారు. అభ్యంత‌రాల స్వీక‌రణ త‌ర్వాత మార్పులు చేయ‌క‌పోతే అవ‌స‌ర‌మైతే కోర్టుకు వెళ్లాల‌ని విప‌క్షాల నేత‌లు భావిస్తున్నారు. ఇలాంటి యోచ‌న‌లో టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన తాజా మాజీ కార్పొరేట‌ర్లు కూడా ఉన్న‌ట్లుగా తెలుస్తోంది.

Advertisement

Next Story