ఆదిలాబాద్‌లో గ్రూపు రాజకీయాలు..

by Aamani |   ( Updated:2020-09-07 05:30:52.0  )
ఆదిలాబాద్‌లో గ్రూపు రాజకీయాలు..
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీలో గులాబీ ముళ్లు గుచ్చుకుంటున్నాయి. 2018 ఎన్నికలకు ముందు మంత్రిగా పని చేసిన ఎమ్మెల్యే జోగు రామన్న చెప్పినట్లే జిల్లా రాజకీయాలు నడిచాయి. టీఆర్ఎస్ రెండో సారి అధికారంలోకి వచ్చిన తరువాత రామన్నకు కేబినెట్ లో బెర్త్ లభించకపోవడం.. తదనంతర పరిణామాలు ఆయనకు వ్యతిరేకంగా మారుతున్నాయి. మంత్రిగా ఉన్న కాలంలో ఆదిలాబాద్, బోథ్ తో పాటు ఖానాపూర్ నియోజకవర్గం లోని ఉట్నూరు ప్రాంతంలోనూ ఆయన హవా నడిచింది. ఇప్పుడు అదే దూకుడును ఆయన కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారన్న అభిప్రాయాలు పార్టీ వర్గాల్లో ఉన్నాయి. ఇది జిల్లాలోని మిగతా నేతలకు నచ్చడం లేదు. దీంతో పార్టీలో వేరు కుంపట్లు తీవ్రమై గ్రూపు రాజకీయాలు ఊపందుకున్నాయి. ఈ విషయమై అధిష్ఠానానికి సైతం ఫిర్యాదులు వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది.

రామన్నకు వ్యతిరేకంగా రాజకీయాలు..!

2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంతా మాజీ మంత్రి జోగు రామన్న చెప్పినట్లే నడిచింది. ఆ తర్వాత నిర్మల్ నియోజకవర్గం నుంచి గెలిచిన ఇంద్రకరణ్ రెడ్డి కేబినెట్ లో బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉమ్మడి జిల్లాలో ఆయన ప్రభావం కొంత తగ్గింది. అయితే ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం ఆయన చెప్పినట్లే అధికార యంత్రాంగం నడిచిందన్న అభిప్రాయాలు ఉన్నాయి.

2018లో రామన్న మళ్లీ ఎమ్మెల్యే గెలిచినప్పటికీ కేబినెట్ లో సీఎం కేసీఆర్ ఆయనకు అవకాశం ఇవ్వలేదు. దీంతో కొద్దిరోజులు అజ్ఞాతంలోకి సైతం వెళ్లారు. ఇది ఆయన వైఖరిపై అధిష్ఠానానికి కోపం తెప్పించిందని ప్రచారం ఉంది. ఆ తర్వాత ఆదిలాబాద్ జిల్లా పై పూర్తిస్థాయిలో ఆయన ప్రమేయంపై కూడా అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయి. ఈ క్రమంలోనే రామన్నకు వ్యతిరేకంగా ఆ జిల్లాలో వేరు కుంపట్లు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ తో మంచి సంబంధాలు ఉన్న రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ చైర్మన్ లోక భూమారెడ్డి తాను సొంతంగా జిల్లాలో రాజకీయాలు నెరిపే ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.

అవకాశం కోసం ‘లోక’ ఎదురుచూపులు..!

సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడిన లోక భూమారెడ్డి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది. రామన్న తో పోలిస్తే ఆదిలాబాద్ నియోజకవర్గంలో ప్రజాబలం తక్కువగానే ఉన్నప్పటికీ లోక భూమారెడ్డి కి సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నది జగమెరిగిన సత్యం. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో తనకు అవకాశం కోసం భూమా రెడ్డి ఎదురుచూస్తున్నారని, అందుకే సొంతంగా కేడర్ ను పెంచుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే వ్యతిరేక కూటమిని అంతర్గతంగా ఏకం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

జెడ్పీ చైర్మన్ రాథోడ్ వేరు కుంపటి..!

ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి ఆదిలాబాద్ జెడ్పీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన రాథోడ్ జనార్ధన్ ను రాజకీయంగా తొక్కే విషయంలో నియోజక వర్గ ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేస్తున్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉద్యోగం వదులుకొని రాజకీయాల్లోకి వస్తే అడుగడుగునా ఆటంకాలు సృష్టించడం వల్ల అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. జెడ్పీ చైర్మన్ గా సక్సెస్ అయితే వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని ఆసిఫాబాద్, బోథ్, ఖానాపూర్ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్నా ఆశతో ఉన్నారు. కానీ, ఆయన వ్యవహారంపై జిల్లా నేతలు నిలువరించే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో కొంత కాలంగా అధికారిక కార్యక్రమాలు మినహా రాజకీయపరంగా ఆయనే స్వయంగా చాప కింద నీరులా పార్టీ కేడర్​ను బిల్డప్​ చేసుకుంటున్నారని తెలుస్తోంది.

బోథ్ ఎమ్మెల్యే బాపురావుది మరోదారి..!

బోథ్ నియోజకవర్గం నుంచి రెండోసారి గెలిచిన రాథోడ్ బాబురావు మరోదారి చూసుకుంటున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2014లో ఎమ్మెల్యే టికెట్ విషయంలో జిల్లాకు చెందిన లోక భూమారెడ్డి ఆయనను బలంగా ప్రోత్సహించారు. ఆ తరువాత వారిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. తర్వాత బాబురావు మళ్లీ గెలిచి నియోజకవర్గంలో బలపడుతున్నాడు. ఇది మాజీ ఎంపీ నగేశ్​కు మింగుడు పడడం లేదు. తన విషయంలో నగేశ్​జిల్లాకు చెందిన సీనియర్ నేతలు లోక భూమారెడ్డి, జోగు రామన్న తో వేర్వేరుగా బాపురావు పై రాజకీయ వ్యూహాలకు పదును పెట్టి… వచ్చే ఎన్నికల్లో బోథ్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని నగేశ్​ భావిస్తున్నారు. దీనిపై రాథోడ్ బాపురావు ఆగ్రహంతో ఉన్నారు.

తన నియోజకవర్గంలో ఆదిలాబాద్ నేతల ప్రమేయంపై ఆయన అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన తాజాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శరణు కోరినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది. ఎవరినీ పట్టించుకోకుండా బాపురావు నియోజకవర్గంలో నిరంతరం పర్యటనలు చేస్తున్నారు. ఆయనకు వ్యతిరేకంగా మాజీ ఎంపీ నగేశ్​కౌంటర్ పర్యటన రాజకీయంగా ఆసక్తి రేపుతున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి ఈ గ్రూపు రాజకీయాలు మరింత ముదిరి పార్టీకి తీవ్ర ఇబ్బందిగా మారే లా ఉందని ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు అభిప్రాయపడ్డారు.

Advertisement

Next Story