సీఎం కేసీఆర్‎కు బర్త్ డే గిఫ్ట్ ఏంటో తెలుసా..!

by Shyam |
సీఎం కేసీఆర్‎కు బర్త్ డే గిఫ్ట్ ఏంటో తెలుసా..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం కేసీఆర్​ పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. హరిత తెలంగాణను స్వప్నిస్తున్న సీఎం సంకల్పానికి మద్దతుగా ఒకే రోజు కోటి మొక్కలను నాటే ‘కోటి వృక్షార్చన’ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రులు మహమూద్ అలీ, తలసాని, ఎంపీలు సంతోష్​, మాలోతు కవిత, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణకు హరితహారం ద్వారా ఆకుపచ్చని రాష్ట్రాన్ని ఆకాంక్షిస్తున్న సీఎం కేసీఆర్ ఆశయాలు ప్రతిబించించేలా ప్రతి ఒక్కరూ 17న మూడు మొక్కలు నాటాలని కోరారు.

టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు అందరూ మొక్కలు నాటి, సంరక్షించే బాధ్యత తీసుకోవటమే కేసీఆర్‌కు పుట్టిన రోజు కానుక అన్నారు. ప్రతి గ్రామం యూనిట్‌గా సర్పంచ్ నేతృత్వంలో అన్ని చోట్లా ఖాళీ ప్రదేశాలను గుర్తించి మొక్కలు నాటాలని, పంచాయితీ రాజ్, అటవీశాఖలతో సమన్వయం ద్వారా కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పారు. ఆరేండ్ల హరితహారం ఫలితాలు ఇప్పుడు కళ్ల ముందు కనిపిస్తున్నాయని, ఎంపీ సంతోష్ నేతృత్వంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కూడా పచ్చదనం పెంపులో అన్ని వర్గాలను జాగృతం చేస్తోందని మంత్రులు మహమూద్ అలీ, తలసాని అన్నారు.

ఎంపీ సంతోష్​ మాట్లాడుతూ రాష్ట్రం, దేశం పచ్చబడాలనే సంకల్పంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేస్తున్న ఈ కోటి వృక్షార్చనలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాల పర్యటనలో ఉన్న మంత్రలు ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇతర మంత్రులు, నేతలకు కార్యక్రమం వివరాలు ఫోన్ ద్వారా తెలిపి సహకారాన్ని కోరారు. కోటి వృక్షార్చన కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్‌ను పార్టీ జనరల్ సెక్రటరీ కేశవరావు, మంత్రులు అభినందించారు.

కోటి వృక్షార్చనలో మొక్కలు నాటే వారందరికీ ప్రత్యేకంగా గుర్తించాలని, వనమాలి బిరుదును ఇవ్వాలని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భావిస్తోంది. ‘ఆ రోజు మొక్కలు నాటుతూ దిగిన ఫొటోలను ప్రత్యేక యాప్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. యాప్ కోసం వాట్సప్ నుంచి 9000365000 నెంబర్‌కు GIC అని మెసేజ్ చేయాలి. యాప్ లింక్‌తో కూడిన మెసేజ్ తిరిగి వస్తుంది. దానిలో మొక్కలు నాటుతూ సెల్ఫీ ఫొటోలను ఎవరికి వారు అప్‌లోడ్ చేయాలి. కోటి వృక్షార్చనలో పాల్గొన్నందుకు గుర్తింపుగా సీఎం సందేశంతో కూడిన వనమాలి బిరుదు ఈ మెయిల్, మొబైల్‌కు వారం రోజుల్లో చేరుతుంది’ అని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధులు కరుణాకర్ రెడ్డి, రాఘవ వివరించారు.

Advertisement

Next Story

Most Viewed