ఆకుపచ్చగా మారుతున్న అంటార్కిటికా మంచు

by Shyam |
ఆకుపచ్చగా మారుతున్న అంటార్కిటికా మంచు
X

అంటార్కిటికా అనగానే తెల్లని మబ్బులు నేల మొత్తం పరుచుకున్నాయా అన్నట్లుండే మంచు కొండలే గుర్తొస్తాయి. కానీ, ఇప్పుడు ఆ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిన తరుణం వచ్చేసింది. అవును.. ప్రస్తుతం అంటార్కిటికా ఖండంలోని మంచు కొండలు ముదురు ఆకుపచ్చ రంగులోకి మారుతున్నాయి. దీనికి కారణం అందులో పెరుగుతున్న ఆల్గే. అరెరే.. అంటార్కిటికాలో జీవజాలం పెరుగుతోందే.. అని సంబర పడిపోవద్దు. ఈ ఆల్గే పెరుగుతుందంటే దాని అర్థం ఎండలు పెరిగి, మంచు కరుగుతోందని. మంచు కరిగితే సముద్రమట్టాలు పెరుగుతాయి. సముద్రమట్టాలు పెరిగితే ద్వీపాలు మునిగిపోతాయి. దీనంతటికి కారణం వాతావరణమార్పులు.

ప్రస్తుతం అంటార్కిటికాలో పెరుగుతున్న ఆకుపచ్చ రంగు ఎంతలా దట్టంగా ఉందంటే.. వీటి పెరుగుదల కారణంగా అంతరిక్షం నుంచి కూడా అంటార్కిటికాలోని కొన్ని ప్రదేశాలు ఆకుపచ్చ రంగులో కనిపిస్తున్నాయట. కేంబ్రిడ్జి యూనివర్సిటీ, బ్రిటీష్ అంటార్కిటిక్ సర్వేకు చెందిన శాస్త్రవేత్తలు ఈ ఆల్గే పెరుగుదల గురించి ఒక పెద్ద మ్యాప్ తయారు చేశారు. దీని తయారీకి వారు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వారి సెంటినెల్ 2 శాటిలైట్ డేటా, అంటార్కిటికాలోని పరిశోధన కేంద్రాలు అందించిన డేటాను క్రోడీకరించారు. వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్‌ని గ్రహించి మొత్తం 1,679 రకాల ఆల్గే జాతులు అంటార్కిటికాలో అభివృద్ధి చెందాయని ఈ మ్యాప్ ద్వారా తెలిసింది. రానున్న కాలంలో ఈ ఆల్గే మరింత పెరిగే అవకాశం ఉందని, వీటిని తినడానికి జంతుజాలం కూడా పరిణామక్రమం చెందే అవకాశం ఉందని శాస్త్రవేత్త మ్యాట్ డేవీ అన్నారు. ఈ ఆల్గే పీల్చుకుంటున్న కార్బన్ డయాక్సైడ్ చాలా తక్కువ కాబట్టి గాలిలో పెరిగిన కార్బన్ డయాక్సైడ్ స్థాయి మీద అది ప్రభావం చూపించలేకపోతోందని డేవీ వివరించారు.

Advertisement

Next Story