తెలంగాణలో వడ్ల కొనుగోళ్లు బంద్​

by Shyam |
తెలంగాణలో వడ్ల కొనుగోళ్లు బంద్​
X

దిశ, తెలంగాణ బ్యూరో : నియంత్రిత సాగుతో రైతులు నిండా మునుగుతున్నారు. అటు సీఎం ప్రకటించడమే తరువాయి.. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. వాస్తవానికి వచ్చే సీజన్​ నుంచి ధాన్యం కొనుగోలు చేయమంటూ సీఎం కేసీఆర్​ ప్రకటించారు. కానీ ఇప్పటికే ధాన్యం రావడం లేదంటూ కేంద్రాలకు తాళాలు వేస్తున్నారు. కానీ కొనుగోళ్లను పరిశీలిస్తే మాత్రం అనుకున్న లక్ష్యంలో సగం కూడా కొనుగోలు చేయలేదు. ఇదే సమయంలో మిల్లర్లు రైతులకు చుక్కలు చూపిస్తున్నారు. మొన్నటిదాకా ఎంతో కొంత ఎక్కువ ధర ఇచ్చినా… ఇప్పుడు సర్కారు చేతులెత్తేస్తుండటంతో ధరను తగ్గిస్తున్నారు. ఫలితంగా క్వింటాకు రూ.1800 వరకే ఇస్తామని చెబుతున్నారు.

ఇంకా 41 లక్షల టన్నులు ధాన్యం ఎక్కడ?

వానాకాలం సీజన్‌లో 34.65 లక్షల ఎకరాల్లో సన్నాలు, 13.23 లక్షల ఎకరాల్లో దొడ్డు రకాలను సాగు చేస్తే.. 98.61 లక్షల టన్నుల సన్న ధాన్యం, 33.33 లక్షల టన్నుల దొడ్డు ధాన్యం కలిపి 1.32 కోట్ల టన్నులు ఉత్పత్తి అవుతుందని లెక్కలేశారు. దీనిలో వ్యాపారులు ఇంచుమించుగా 30 లక్షల టన్నులు, ఇంకొంత ఆహార నిల్వలకు మినహాయిస్తే.. 85.69 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుత లెక్కల ప్రకారం మొత్తం ధాన్యంలో కేవలం 43.90 లక్షల టన్నులే కొనుగోలు చేశారు. నిర్ణీత లక్ష్యంతో పోలిస్తే 41.79 లక్షల టన్నుల తేడా ఉంది. ఇంచుమించుగా సగం లక్ష్యాన్ని మాత్రమే చేరుకున్నారు. ఇందులో 17.20 లక్షల సన్నధాన్యం ఉండగా… 26.70 లక్షల దొడ్డు రకాలను కొనుగోలు చేశారు. ఇక రాష్ట్రంలో ప్రైవేట్​ మిల్లర్లు, వ్యాపారులు 28 లక్షల టన్నుల సన్నవడ్లు కొనుగోలు చేసినట్లు లెక్కలేస్తున్నారు. నాలుగున్నర లక్షల దొడ్డు ధాన్యాన్ని కూడా వ్యాపారులు కొనుగోలు చేశారు. ఈ ప్రైవేట్​ కొనుగోళ్లు ముందస్తు అంచనా వేసిందే. అంటే కొనుగోలు కేంద్రాలకు వెళ్లాల్సిన ధాన్యం మిల్లర్ల వరకూ ఇంకా వెళ్లలేదని స్పష్టమవుతోంది. కానీ కొనుగోలు కేంద్రాలకు వెళుతుందని భావించిన ధాన్యం ఇంకా మిగిలే ఉంది. దాదాపుగా 41 లక్షల టన్నుల ధాన్యం ఇంకా రైతుల దగ్గరే ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఇవేమీ పట్టించుకోకుండానే ప్రభుత్వం కొనుగోళ్లపై చేతులెత్తేస్తోంది.

4 వేల కొనుగోలు కేంద్రాలు మూత

వానాకాలం సీజన్​లో పండించిన ధాన్యం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 6,497 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా.. డిసెంబర్​ 31 వరకు 3,637 సెంటర్లను మూసివేశారు. ఈ మూడు రోజుల వ్యవధిలో మూతబడిన కేంద్రాలు 4 వేలకు చేరాయి. ఖమ్మం, ఆదిలాబాద్​, నిజామాబాద్​, మహబూబ్​నగర్​, నల్లగొండ వంటి జిల్లాల్లో దాదాపుగా కేంద్రాలను మూసి వేశారు. సీఎం కేసీఆర్​ ప్రకటన తరువాతే కేంద్రాల మూసివేత మొదలైంది. అయితే ఆయా ప్రాంతాల్లో మాత్రం కొనుగోళ్లు మందగించాయని, నిల్వలు లేవని, అందుకే మూసివేస్తున్నట్లు చెబుతున్నారు. కానీ ఇంకా తమ దగ్గర ధాన్యం ఉందంటూ గ్రామాల్లో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదే అదనుగా వ్యాపారుల దందా

ఇదే అదనుగా తీసుకున్న మిల్లర్లు, వ్యాపారులు ధరను తగ్గిస్తున్నారు. ఇప్పటి వరకు సన్నాలకు ఎంతో కొంత డిమాండ్​ ఉండటంతో పక్క రాష్ట్రం నుంచి కూడా వచ్చిన వ్యాపారులు సన్నాలకు రూ. 2100 వరకు పెట్టి కొనుగోలు చేశారు. కానీ రాష్ట్రంలో ఒక్కొక్కటిగా ధాన్యం కేంద్రాలు మూసివేస్తుండటంతో వ్యాపారులు కూడా అదే తరహాలో ధరను తగ్గిస్తున్నారు. ఆదివారం వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో రూ.1800 వరకే కొంటామని చెబుతుండటంతో.. తప్పలేని పరిస్థితుల్లో రైతులు కూడా అమ్ముకుంటున్నారు. కొనుగోలు కేంద్రాలు మూసివేస్తుండటంతోనే ఈ పరిస్థితి వచ్చిందంటూ ఆరోపిస్తున్నారు.

ఇక సన్నాలకు మంగళం

మరోవైపు నియంత్రిత సాగుపై ప్రభుత్వం చేతులెత్తేసింది. ఆ పద్ధతే లేదని తేల్చింది. దీంతో రైతులు కూడా సన్నాల సాగును వదిలేస్తున్నారు. వాస్తవంగా వానాకాలంలోనే చాలా నష్టాలు చవిచూశారు. దిగుబడులు గణనీయంగా తగ్గాయి. ఎకరాకు 24 క్వింటాళ్ల వరకు ధాన్యం.. ఈసారి పరిస్థితులతో కేవలం 15 క్వింటాళ్ల వరకే పరిమితమయ్యాయి. అటు పెట్టుబడి కూడా గణనీయంగా పెరిగింది. సన్న వడ్లు సాగు చేసిన రైతులు ఎకరాకు రూ. 7 వేల వరకు అదనంగా పెట్టుబడి పెట్టారు. దిగుబడి తగ్గడంతో ఈసారి సన్నాల సాగు పడిపోతోంది.

Advertisement

Next Story

Most Viewed