కరోనా వ్యాక్సిన్‌లపై జీఎస్టీ మినహాయింపు ఆలోచనలో కేంద్రం!

by Harish |   ( Updated:2021-04-29 06:34:38.0  )
కరోనా వ్యాక్సిన్‌లపై జీఎస్టీ మినహాయింపు ఆలోచనలో కేంద్రం!
X

దిశ, వెబ్‌డెస్క్: ఇప్పటికే కరోనా వ్యాక్సిన్‌లపై కస్టమ్స్ సుంకాన్ని రద్దు చేసిన కేంద్రం, కరోనా వ్యాక్సిన్ ధరలకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. చాలామంది వ్యాక్సిన్‌ను ఉచితంగానే ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నారు. ఈ క్రమంలో సామాన్యులపై భారాన్ని తగ్గించేందుకు టీకాలపై వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) తొలగించే అవకాశాలున్నట్టు సమాచారం. జీఎస్టీని తొలగించడం ద్వారా కరోనా ధరలు తగ్గుతాయని, ఎక్కువ మంది వ్యాక్సిన్ వేసుకునేందుకు వీలవుతుందని కేంద్రం భావిస్తున్నట్టు తెలుతోంది. అయితే, దీనిపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. కరోనా వ్యాక్సిన్‌లు ప్రైవేట్ ఆసుపత్రులలో రూ. 1,200 వరకు ఉన్నాయి.

సీరం ఇన్‌స్టిట్యూట్ కొవీషీల్డ్ ధర ప్రభుత్వానికి రూ. 300 ఉండగా, ప్రైవేట్ ఆసుపత్రులకు రూ. 600 ఉంది. భారత్ బయోటెక్ కొవాగ్జిన్ ప్రభుత్వానికి రూ. 600, ప్రైవేట్ ఆసుపత్రులకు రూ. 1,200గా ఉంది. వ్యాక్సిన్ కావాల్సిన వారు రెండు మోతాదులను తీసుకోవాల్సి ఉంటుంది. ఓ జాతీయ పత్రిక కథనం ప్రకారం.. ప్రజలపై భారాన్ని తగ్గించేందుకు, ఎక్కువ టీకాలను అందించేందుకు ప్రభుత్వం టీకాపై జీఎస్టీ మినహాయింపు ఇవ్వొచ్చని తెలిపింది. ఇప్పటికే కరోనా కోసం మందుల తయారీకి అవసరమైన ఔషధ ముడి పదార్థాలపై దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం మాఫీ చేసింది. ఈ క్రమంలో కరోనా వ్యాక్సిన్‌లపై 5 శాతం జీఎస్టీని తొలగించాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed