కార్మికులకు గుడ్ న్యూస్.. కొత్త పథకం తెస్తున్న కేంద్రం

by Anukaran |
central govt
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని అసంఘటిత రంగంలోని కార్మికుల కోసం కార్మిక శాఖ మంత్రిత్వ శాఖ ఈ-శ్రమ్ పోర్టల్‌ను ఆవిషరించింది. ఈ పోర్టల్ ద్వారా దేశీయంగా అసంఘటిత రంగంలో ఉన్న 38 కోట్ల కార్మికుల వివరాలను సేకరించనున్నారు. అదేవిధంగా వారి సంక్షేమం కోసం పలు సామాజిక భద్రతా పథకాలను అమలు చేసేందుకు వీలవుతుంది. ఈ వివరాలను ఆధార్ కార్డ్ ఆధారంగా ఈ-పోర్టల్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుందని, దీని ద్వారా కేటగిరీల వారీగా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు కార్మికులకు అందించేందుకు వీలవుతుందని కార్మిక, ఉపాధి శాఖా మంత్రి భూపేందర్ యాదవ్ అన్నారు. ఈ పోర్టల్‌లో కార్మికుల వివరాలను చేర్చడం ద్వారా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సామాజిక భద్రతా పథకాలను వారికి అందించేందుకు సులభతరం కానుంది.

అంతేకాకుండా ఇందులో నమోదైన కార్మికులకు రూ. 2 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుంది. ఈ మొత్తం కేంద్రమే భరించనుంది. కార్మికులు ఎవరైనా ప్రమాదంలో మరణిస్తేనో, శాశ్వత వైకల్యం బారిన పడితేనో రూ. 2 లక్షలు, పాక్షికంగా వైకల్యం బారిన పడితే రూ. లక్ష వరకు ఇవ్వనున్నట్టు మంత్రిత్వ శాఖ వివరించింది. దేశవ్యాప్తంగా అసంఘటిత రంగంలో ఉన్న అందరూ కార్మికులు గురువారం నుంచే తమ పేర్లను ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకునే వీలుంటుంది. ఇందులో వారి పుట్టిన తేదీ, స్వస్థలం, మొబైల్ నంబర్ సహా ఇతర వివరాలను అందజేయాలి. ఆధార్ కార్డు, బ్యాంకు వివరాల ఆధారంగా నమోదు కావొచ్చు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆయా కార్మికులకు ఈ-శ్రమ్ కార్డు అందజేయనున్నారు. ఈ కార్డు ఆధారంగానే వారికి దక్కాల్సిన ప్రయోజనాలు అందనున్నాయి.

Advertisement

Next Story

Most Viewed