మామిడి కోత‌కు ఉపాధి కూలీలు

by Sridhar Babu |
మామిడి కోత‌కు ఉపాధి కూలీలు
X

దిశ‌, ఖ‌మ్మం: ఉపాధి కూలీల ప‌ని జాబితాలో మామిడి పండ్ల కోత కూడా చేరిపోనుంది. పంట కోత‌కు వ‌చ్చినా కూలీలు రాక‌పోవ‌డం, లాక్‌డౌన్ నేప‌థ్యంలో కోయ‌లేని ప‌రిస్థితి ఉండ‌టంతో మామిడి సీజ‌న్‌లో స్తబ్ద‌త ఏర్ప‌డుతోంది. వాస్త‌వానికి ఏప్రిల్ మొద‌టి మాసంలో మామిడి పండ్ల అమ్మకాలు జోరందుకుంటాయి. కానీ ఈ సారి క‌రోనా ఎఫెక్ట్‌తో ఇప్ప‌టివ‌ర‌కు తొలి పంట ఇంకా రైతుల చేతికి అంద‌కుండా పోతోంది. లాక్‌డౌన్ కార‌ణంగా కూలీలు బ‌య‌ట‌కు రావ‌డం లేదు. ఒక‌వేళ కోత చేప‌ట్టినా అమ్మ‌కానికి ఇబ్బందులు ఎదురుకానుండ‌టంతో ఏం చేయాలో రైతుల‌కు అర్థం కావ‌డం లేదు. ఏప్రిల్ 15 వ‌ర‌కు ఆగాలంటే పంట న‌ష్టం జ‌రుగుతుంద‌ని ఆందోళ‌న చెందుతున్నారు. మామిడి రైతుల ప‌రిస్థితిపై ఉన్న‌తాధికారులు ముఖ్య‌మంత్రి దృష్టికి తీసుకెళ్ల‌గా, కోత‌కు ఉపాధి హామీ కూలీల‌ను వినియోగించుకునేలా ఉత్త‌ర్వులు జారీ చేస్తామ‌ని చెప్పిన‌ట్లు తెలుస్తోంది. ఈ విష‌యాన్ని ఖ‌మ్మం జిల్లా ఉద్యాన‌వ‌న‌, ఎంపీడీవోలు ధ్రువీక‌రిస్తున్నారు.

అమ్మ‌కాలకు కూడా ఏర్పాట్లు

క‌రోనా కార‌ణంగా లాక్‌డౌన్ దేశ వ్యాప్తంగా అమ‌ల‌వుతున్న నేప‌థ్యంలో మామిడి రైతులు స్థానికంగానే పంట‌ను విక్ర‌యించుకునేందుకు అనుమ‌తులు ఇవ్వ‌నున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మామిడి రైతులు స్థానికంగా మార్కెట్ చేసుకోవడ‌మే ఉత్త‌మ‌ని అధికారులు చెబుతున్నారు. సూపర్‌మార్కెట్లు, రైతుబజార్లు, మార్కెట్లు, గ్రామపంచాయతీ మార్కెట్లు, వ్యవసాయ మార్కెట్లను లక్ష్యంగా చేసుకుంటే విక్ర‌యాల‌కు కొదువ ఉండ‌ద‌న్న‌ది అధికారులు చెబుతున్న మాట‌. అలాగే ఎగుమ‌తి చేయాల‌నుకున్న రైతుల‌కు ర‌వాణాకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయ‌నున్న‌ట్లు అధికారులు చెబుతున్నారు. అలాగే సంచార మార్కెట్ల ద్వారా కూడా విక్ర‌యించుకునేందుకు వీలు క‌ల్పిస్తామ‌ని అధికారులు భ‌రోసా ఇస్తున్నారు. అయితే కార్బ‌న్ ర‌హితంగా మ‌గ్గ పెట్టిన పండ్ల‌నే విక్ర‌యించాల‌ని సూచించారు. ఎలాంటి అవ‌క‌త‌వ‌కల‌కు పాల్ప‌డిన క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రిస్తున్నారు.

జిల్లాలో 9.19వేల ఎక‌రాల్లో మామిడి సాగు

ఈ ఏడాది ఖమ్మం జిల్లాలో 30లక్షల 65వేల 530ఎకరాల్లో మామిడి తోటల‌ను రైతులు సాగు చేస్తుండ‌టం గ‌మ‌నార్హం. ఎక‌రానికి నాలుగు వేల చొప్పున దాదాపు 9లక్షల 19వేల 659క్వింటాళ్ల మామాడి దిగుబ‌డి ఈ ఏడాది వ‌స్తుంద‌ని ఉద్యాన‌వ‌న శాఖ అధికారులు అంచ‌నా వేస్తున్నారు. ఖమ్మం అర్బన్, రఘునాథ‌పాలెం, బోనకల్, చింతకాని, మధిర, ఎర్రపాలెం, ఖమ్మం రూరల్, కూసుమంచి, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, వేములూరు, కామేపల్లి, కొనిజర్ల, కారేపల్లి మండ‌లాల్లో విస్తారంగా మామిడి తోట‌లు సాగ‌వుతున్నాయి. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట, దమ్మపేట, అన్నపురెడ్డిపల్లి, పాల్వంచ, బూర్గంపాడు, తదితర మండలాల్లో మామిడి తోటలు విరివిగా సాగవుతున్నాయి.

Tags : mangoes, will use labor, corona effect, lockdown, khammam, horticulture, CM KCR, Farmers

Advertisement

Next Story