- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రామగుండం ఫెర్టిలైజర్ కంపెనీలో ఉద్యోగాల దందా.. గోనె ప్రకాశ్ సంచలన కామెంట్స్
దిశ, గోదావరిఖని : ఆర్ఎఫ్‌సీఎల్‌లో ఉద్యోగాల దందా గోదావరిఖనిలో చర్చనీయాంశంగా మారుతోంది. ఎంతోమంది నిరుద్యోగుల వద్ద ఉద్యోగాల పేరుతో లక్షల రూపాయలు వసూలు చేశారని గోనె ప్రకాశ్ రావు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. గతంలో సైతం రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉద్యోగాల పేరుతో లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని వచ్చిన ఆరోపణల మేరకు అధికారులు దర్యాప్తు సైతం నిర్వహించారు.
ఆ సమయంలో డబ్బులు పెట్టి ఉద్యోగంలో చేరిన కొంతమందిని విచారణ సమయంలో పక్కకు పెట్టి సమీప గ్రామాలకు చెందిన కొంతమంది యువకులను ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. విచారణ ముగియగానే మళ్లీ వారిని పక్కన పెట్టి డబ్బులు కట్టినవారిని ఉద్యోగాల్లోకి తీసుకున్నారని విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే గోదావరిఖని ప్రెస్ క్లబ్‌లో ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశ్ రావు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉద్యోగ దందాలపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
గతంలో కార్పొరేటర్‌గా పోటీ చేసి ఓడిపోయిన మోహన్ గౌడ్ అనే వ్యక్తి పర్మినెంట్ ఉద్యోగాల పేరుతో 370 మంది వద్ద సుమారుగా ఒక్కొక్కరి వద్ద నుంచి 5 నుంచి 8 లక్షల వరకు వసూలు చేశారని వారికి వెంటనే డబ్బులు తిరిగి ఇవ్వాలని లేకపోతే అందరి చిట్టా విప్పుతానని పేర్కొన్నారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉద్యోగాలను పర్మినెంట్ చేస్తే 10 కోట్ల రూపాయలను డిపాజిట్ చేస్తానని దీనికి బహిరంగ చర్చకు వస్తారా అని ప్రశ్నించారు. అయితే ఈ వ్యాఖ్యలపై కొంతమంది వ్యక్తులు శుక్రవారం గోదావరిఖని ప్రెస్ క్లబ్‌లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
దీనిలో భాగంగా ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మంత్రి కొప్పుల ఈశ్వర్‌పై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అనంతరం విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఎటువంటి సమాధానాలు చెప్పకుండా వెళ్లిపోయారు. ఇప్పటి వరకు రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉద్యోగాల పేరుతో కోట్ల రూపాయలు చేతులు మారాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని తన కనుసైగల్లో నడిపిస్తూ రాజకీయ అండదండలతో అనతి కాలంలోనే ఉన్నత స్థాయికి చేరుకున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎటువంటి ఉద్యోగం కావాలన్న తన అనుమతి తప్పనిసరని పలువురు చర్చించుకుంటున్నారు.
RFCLలో త్రిమూర్తులు ఎవరు..?
రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉద్యోగాల పేరుతో లక్షల రూపాయలు దండుకుంటున్న త్రిమూర్తులు ఎవరు అనే చర్చ జోరుగా కొనసాగుతోంది. కార్పొరేటర్‌గా పోటీ చేసి ఓడిపోయిన ఓ వ్యక్తి.. రామగుండంలోని ఓ డివిజన్‌కు చెందిన సామాజిక సంస్థకు సంబంధించిన కార్పొరేటర్‌లకు బినామీగా వ్యవహరిస్తూ ఉద్యోగాలలో చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో కంటే రెట్టింపు స్థాయిలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వీరికి బినామీ వ్యక్తిగా ఎల్కలపల్లికి చెందిన వ్యక్తి వ్యవహరిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇన్ని లక్షల రూపాయలు చేతులు మారుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అంతే కాకుండా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో సైతం తనకంటూ ప్రత్యేక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని భూముల విషయంలో చక్రం తిప్పుతున్నాడని పలువురు చర్చించుకుంటున్నారు.
ప్రశ్నార్థకంగా విచారణ కమిటీ..?
రామగుండం ఎరువుల కర్మాగారంలో నిరుద్యోగుల నుండి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని ప్రజా సంఘాలతో పాటు ఇతర నాయకులు సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేయడంతో స్పందించిన అధికారులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో ఎంతో మంది నిరుద్యోగులు లక్షల రూపాయలు పెట్టి ఉద్యోగాలలో చేరినట్లు తేలడంతో కొంతమందిని ఉద్యోగాల నుంచి తొలగించారు. వారి స్థానంలో చుట్టుపక్కల గ్రామాలకు చెందిన కొంతమంది యువకులను ఉద్యోగాల్లోకి తీసుకొని విచారణ ముగియగానే మళ్లీ ఉద్యోగాల నుంచి తొలగించారు. యథావిధిగా మళ్లీ డబ్బులు పెట్టి చేరిన వారిని ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. అయితే విచారణలో లక్షల రూపాయలు చేతులు మారాయని తెలిసి కూడా చర్యలు తీసుకోవడంలో అధికారులు వెనకడుగు వేయడంపై రాజకీయ ఒత్తిడే కారణమని విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో గుట్టుచప్పుడు కాకుండా విచారణను ముగించారనే విమర్శలు సైతం ఉన్నాయి. ఇప్పటికైనా దీనిపై అధికారులు ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.
- Tags
- Gone Prakash Rao