హైదరాబాద్‌లో గోల్డ్‌మాన్ శాక్స్ కార్యాలయం!

by Harish |   ( Updated:2020-11-16 05:48:07.0  )

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ ఆర్థిక సేవలు, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ సంస్థ గోల్డ్‌మాన్ శాక్స్ హైదరాబాద్‌లో గ్లోబల్ సర్వీసెస్ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్‌లో చేపట్టనున్న గోల్డ్‌మాన్ శాక్స్ కార్యకలాపాలకు రాష్ట్రప్రభుత్వం సహకరిస్తుందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్‌లో తెలిపారు. అంతర్జాతీయంగా ఆర్థిక సేవలను అందిస్తున్న గోల్డ్‌మాన్ శాక్స్ ఇప్పటికే బెంగళూరులో తన కార్యాలయాన్ని నిర్వహిస్తోంది. తాజాగా వాణిజ్య, సాంకేతిక దిగ్గజ కంపెనీల హబ్‌గా మారిన హైదరాబాద్‌లో కార్యాలయాన్ని నెలకొల్పాలని ఈ సంస్థ నిర్ణయించింది. 2021 ఆర్థిక సంవత్సరం రెండో సగం నాటికి హైదరాబాద్ సెంటర్ నుంచి కార్యకలాపాలను ప్రారంభించేందుకు కంపెనీ ప్రణాళిక సిద్ధం చేసిందని, 500 మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం బెంగళూరు కేంద్రంలో 6 వేల మంది ఉద్యోగులున్నారు. హైదరాబాద్‌లో వ్యాపార భవనాల సదుపాయంతో పాటు ఉద్యోగులకు అందుబాటులో గృగాలు, నాణ్యమైన మౌలిక వసతులు లభిస్తాయని, అందుకే ఇక్కడ రెండో కార్యాలయాన్ని నెలకొల్పనున్నట్టు కంపెనీ పేర్కొంది.

కాగా, హైదరాబాద్‌లో ఇప్పటికే సింగపూర్‌కు చెందిన డీబీఎస్, అమెరికాకు చెందిన స్టేట్ స్ట్రీట్, సింక్రోని ఫైనాన్షియల్ లాంటి ఆర్థిక రంగ దిగ్గజ కంపెనీలు వచ్చాయి. ఆర్థిక సేవల రంగంలో విశేషమైన గోల్డ్‌మాన్ శాక్స్ అమెరికాలోని న్యూయార్క్ కేంద్రంగా బహుళజాతి పెట్టుబడుల బ్యాంకును నిర్వహిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ సంస్థల్లో ఒకటైన ఈ కంపెనీ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్, అసెట్ మేనేజ్‌మెంట్, సెక్యూరిటీస్, ప్రైమ్ బ్రోకరేజీ వంటి సేవలతో పాటుగా సంస్థాగత పెట్టుబడిదారులకు ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ సేవలను అందిస్తోంది. ఈ సంస్థ 1869లో ప్రారంభమవగా, గతేడాది ఈ కంపెనీ ఆదాయం 3,654 కోట్ల డాలర్లకుపైనే నమోదు చేసింది.

Advertisement

Next Story

Most Viewed