ఆ 17 కోట్ల బంగారం ఎవరిది?

by Sumithra |
ఆ 17 కోట్ల బంగారం ఎవరిది?
X

గన్నవరం విమానాశ్రయంలో పట్టుబడిన బంగారం విజయవాడలోని బంగారు ఆభరణాల వర్తకుల్లో కలకలం రేపుతోంది. నిన్నమొన్నటి వరకు డొమెస్టిక్ ఎయిర్ పోర్ట్‌గా ఉన్న గన్నవరం విమానాశ్రయంలో ఇంత భారీ ఎత్తున బంగారం పట్టుబడడం కలకలం రేపుతోంది. ఇంత పెద్ద ఎత్తున బంగారం పట్టుబడడం ఇదే తొలిసారా? లేక గతంలో ఎప్పుడైనా ఇంత పెద్దమొత్తంలో బంగారం తెచ్చారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

గన్నవరం విమానాశ్రయం 2018 వరకు డొమెస్టిక్ విమానాశ్రయంగానే ఉంది. అమరావతి రాజధాని కావడంతో 2018లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చోరవతో అంతర్జాతీయ విమానాశ్రయంగా రూపుదిద్దుకుంది. డెమెస్టిక్ విమానాశ్రయంగా ఉండగా లేదా అంతర్జాతీయ విమానాశ్రయంగా మారిన తరువాతైనా ఇంత భారీ మొత్తంలో బంగారం పట్టుబడడం ఇదే తొలిసారి.

రికార్డు స్థాయిలో సుమారు 17 కోట్ల రూపాయల విలువైన 20 కేజీల బంగారు, వెండి ఆభరణాలు ఒకేసారి ఎలాంటి బిల్లులు లేకుండా పంపడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ వ్యవహారం చూస్తుంటే బంగారం పట్టుబడడం ఇదే తొలిసారి కావచ్చు కానీ బంగారం తరలింపు మాత్రం తొలిసారి కాదని స్పష్టమవుతోంది. ముంబై నుంచి వచ్చిన ఆ కార్గో కొరియర్ ఏపీలోని బంగారు వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది.

పన్నులు ఎగ్గొట్టడం ద్వారా అక్రమ సంపాదనకు తెరతీసిన బంగారు వ్యాపారులెవరు? ఎన్నిసార్లు ఇలా అక్రమ మార్గంలో బంగారాన్ని తెప్పించుకున్నారు? ఈ అక్రమ దందాలో భాగమైన బడా వ్యాపారులెవరు? వంటి వివరాలన్నీ విజయవాడ పోలీసులు కూపీలాగుతున్నారు. దీంతో విజయవాడ కేంద్రంగా బంగారు వ్యాపారం నిర్వహించే వర్తకుల్లో ఆందోళన రేగుతోంది.

Advertisement

Next Story